రామారెడ్డి (సదాశివనగర్), జనవరి 6: కులపెద్దల మాట వినకుండా కన్న తల్లి అంత్యక్రియలకు హాజరయ్యారన్న కారణంతో ఓ మహిళ సహా ఐదు కుటుంబాలను బహిష్కరించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ధర్మారావుపేటలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని ఓ సామాజికవర్గానికి చెందిన రెండు వర్గాల మధ్య పాత కక్షలు ఉన్నాయి. ఓ వర్గానికి చెందిన వ్యక్తి తల్లి గత ఆగస్టులో చనిపోయింది.
అదే గ్రామంలో ఉండే ఆమె కూతురును అంత్యక్రియలకు వెళ్లొద్దని కుల పెద్దలు ఆదేశించారు. వారి మాట వినకుండా అంత్యక్రియలకు హాజరు కావడంతో ఆమె సహా ఐదు కుటుంబాలను కులపెద్దలు బహిష్కరించారు. వారితో ఎవరైనా మాట్లాడితే రూ.5 వేల జరిమానా విధిస్తామని చాటింపు వేయించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.