మన్సూరాబాద్, మే 24: జన సంచారం ఉండే ప్రదేశంలో ఓ యువతీ యువకుడు మద్యం సేవిస్తూ.. నడిరోడ్డుపై హల్చల్ చేశారు. పొద్దుపొద్దునే రోడ్లపై ఇలాంటి పనులు చేయవచ్చా.. అని ప్రశ్నించిన మార్నింగ్ వాకర్స్‌ను దుర్భాషలాడారు. ఈ ఘటనను రికార్డ్ చేస్తున్న వాకర్స్ ఫోన్లను లాక్కునేందుకు ప్రయత్నించారు. అరగంట పాటు సదరు యువతీ యువకుడు మద్యం సేవిస్తూ రోడ్డుపై హంగామా చేసిన వీడియో సోషల్ మీడియోలు చక్కర్లు కొట్టింది. ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. నాగోల్ డివిజన్ పరిధి హిందూ అరణ్య సమీపం నుంచి ఫతుల్లాగూడ యానిమల్ కేర్ సెంటర్‌కు వెళ్లే మార్గంలో ప్రతినిత్యం వందలాది మంది మార్నింగ్ వాక్ చేస్తుంటారు. యథావిధిగా గురువారం ఉదయం 6 గంటల సమయంలో కూడా వాకర్స్ ఈ మార్గంలో వాకింగ్‌కు బయలుదేరారు. కారును నడిరోడ్డుపై నిలిపి.. బహిరంగ ప్రదేశంలో ఓ యువతీ యువకుడు బీరు సీసాలు చేతులో పట్టుకుని తాగుతూ కనిపించారు. అటువైపుగా వెళ్తున్న వాకర్స్ ఇది గమనించి..
జనసంచారం ఉండే ప్రదేశంలో ఇదేంటని ప్రశ్నించారు. దీంతో మద్యం మత్తులో ఉన్న యువతీ యువకుడు వాకర్స్‌పై తిరగబడ్డారు. ‘ఈ ప్రదేశంలో మద్యం తాగవద్దని ఎక్కడైనా రాసి ఉందా.. ఇదేమైనా నిషేధిత ప్రాంతమా’.. అంటూ దుర్భాషలాడారు. ఈ ఘటనను రికార్డ్ చేస్తున్న వాకర్స్ సెల్ఫోన్లను లాక్కునేందుకు ప్రయత్నించారు. మద్యం మత్తులో యువతీ యువకుడు చేస్తున్న హంగామాను గమనించి.. పెద్ద ఎత్తున వాకర్స్ అక్కడి చేరుకోవడంతో చివరకు ఇద్దరు కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయంపై కొందరు నాగోల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేను నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రోడ్డుపై నిల్చుని మద్యం సేవిస్తూ ధూమపానం చేసిన ఇద్దరిని పోలీసులు గుర్తించారు. మద్యం తాగవద్దని వారించిన సీనియర్ సిటిజన్స్‌ను అసభ్యకరరీతిలో దూషించిన తార్నాకకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అలెక్స్ బోడిచెర్ల (25)తో పాటు సదరు యువతిని పోలీసులు అరెస్టు చేశారు. సదరు యువతి సైతం సాఫ్ట్వేర్ ఉద్యోగి అని తెలిసింది.
అబిడ్స్: మద్యం మత్తులో రోడ్డుపై న్యూసెన్స్ సృష్టిస్తున్న ఓ యువతిని అబిడ్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. శుక్రవారం మధ్యాహ్నం నాంపల్లి రైల్వే స్టేషన్ రోడ్డుపై ఓ యువతి మద్యం సేవించి హల్చల్ చేసింది. పోలీసులు ఆ యువతిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆమెకు నచ్చచెప్పి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ విషయమై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు.