జెన్-జీ తరం.. విభిన్నంగా ఆలోచిస్తుంది. టెక్నాలజీ విషయంలోనే కాదు.. ‘ఫ్యాషన్’ను ఫాలో కావడంలోనూ ప్రత్యేకంగా నిలుస్తున్నది. కంటికి నచ్చినవి కొంటున్నది. ఎంత నచ్చజెప్పినా.. నచ్చనివాటిని పక్కన పెట్టేస్తున్నది. అయితే.. ఫ్యాషన్ విషయంలో జెన్-జీ వ్యవహారం కాస్త తికమక పెట్టేదిగా ఉంటున్నదని నిపుణులు చెబుతున్న మాట. ఫ్యాషన్ పట్ల, పర్యావరణం పట్ల.. వీళ్లు మరింత బాధ్యతాయుతంగా మెలగాలని సూచిస్తున్నారు. వారికోసం కొన్ని ఫ్యాషన్ చిట్కాలను అందిస్తున్నారు.
నచ్చిన దుస్తులను ఇష్టారీతిన కొనుగోలు చేస్తూ.. వార్డ్రోబ్ను నింపేయడం సరికాదని చెబుతున్నారు. ఒక్కో సందర్భానికి తగ్గట్టు ఒక్కో డ్రెస్ కొనే బదులుగా.. రెండుమూడు సందర్భాలకూ నప్పేలా ఒకటే కొనడం మంచిదని సలహా ఇస్తున్నారు. కొన్ని తటస్థ రంగులు.. అన్ని సందర్భాల్లోనూ వేసుకోవచ్చనీ.. బ్లేజర్, వైట్ షర్ట్, బ్లూ జీన్స్ ఇవి ఎలాంటి అకేషన్కైనా బాగుంటాయని చెబుతున్నారు. ఇక వెరైటీలకు బదులుగా.. నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. జెన్-జీ ఎక్కువగా వాడిపారేసే రకం దుస్తులనే కొనుగోలు చేస్తున్నదనీ, దీనివల్ల పర్యావరణానికీ హాని కలుగుతున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో నేటితరం ఎంతో మారాల్సిన అవసరం ఉన్నదని అంటున్నారు.
కొందరైతే ప్రమాదవశాత్తూ కొత్త బట్టలు కొంచెం చిరిగినా, కుట్లు ఊడినట్టు కనిపించినా.. బయట పడేస్తుంటారనీ, వెంటనే మరో జత కొనుగోలు చేస్తుంటారని చెబుతున్నారు. ఇలా చేయడం ఆర్థికంగానే కాదు.. పర్యావరణపరంగానూ మంచిదికాదని పేర్కొంటున్నారు. చిరిగిన ప్రాంతంలో కుట్లు వేయించుకొని మళ్లీ వాడుకోవచ్చన్న సంగతిని నేటితరం గుర్తెరగాలని హితవు పలుకుతున్నారు. చివరగా.. మనదేశ వాతావరణానికి అనుకూలంగా ఉండే ‘కాటన్’ దుస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. ఇవి ఒంటితోపాటు భూమికీ హాని చేయకుండా ఉంటాయని చెబుతున్నారు. పాలిస్టర్, రేయాన్ వంటి రసాయనాలు, ప్లాస్టిక్ ఆధారిత బట్టలకు దూరంగా ఉండటమే మంచిదని అభిప్రాయపడుతున్నారు.