నల్లగొండ : నకిరేకల్ నియోజకవర్గంలో రైతులకు కోతల్లేని 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందజేయాలని కోరుతూ నల్లగొండ లోని ట్రాన్సకో విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ముందు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో రైతన్నలతో కలిసి కాలిపోయిన బోరు మోటర్లతో పాటు ఎండిపోయిన వరి కట్టలతో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు రైతులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో నీళ్లు, కరెంట్ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
నియోజకవర్గంలో కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో రెప్పపాటు కూడా కరెంట్ పోలేదని గుర్తు చేశారు. లో వోల్టేజీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు.