Karthik Subbaraj | మెగా హీరో వరుణ్ తేజ్ తన సినీ ప్రయాణంలో మరో విభిన్నమైన అడుగు వేయడానికి సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుతో వరుణ్ తేజ్ జతకట్టబోతున్నట్లు సమాచారం. సాధారణంగా కార్తీక్ సుబ్బరాజు యాక్షన్, రివెంజ్ డ్రామాలు తెరకెక్కించడంలో దిట్ట. అయితే, ఈసారి ఆయన మార్పునకు శ్రీకారం చుట్టూ వరుణ్ తేజ్ హీరోగా పూర్తి స్థాయి రొమాంటిక్ లవ్ స్టోరీని ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
మరోవైపు, వరుణ్ తేజ్ తన తదుపరి సినిమాల విషయంలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన సోదరి నిహారిక కొణిదెల నిర్మాణంలో, యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘భారీ’ షూటింగ్లో వరుణ్ త్వరలోనే పాల్గొననున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కబోయే ప్రాజెక్ట్‌తో పాటు ఇతర చిత్రాలపై పూర్తి దృష్టి పెట్టనున్నారు. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ ఇటీవల కొరియన్ కనకరాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు.