Vijay Deverakonda | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన కుటుంబంతో గడిపిన మధురమైన క్షణాలకు సంబంధించిన ఒక క్యూట్ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. భారీ వర్షాల కారణంగా విజయ్ తాజా సినిమా షూటింగ్ అనూహ్యంగా రద్దు కాగా, ఆ సమయాన్ని ఆయన పూర్తిగా తన కుటుంబంతో కలిసి విశ్రాంతిగా గడపాలని నిర్ణయించుకున్నారు. చిన్నతనంలో తాను ఎంతో ఇష్టపడే ప్రదేశంలో, తన తల్లిదండ్రుల మధ్య హాయిగా నిద్రపోతున్న ఒక అరుదైన ఫోటోను ఆయన తన అధికారిక ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఈ క్యూట్ పిక్కు విజయ్ క్యాప్షన్ ఇస్తూ, వర్షం కారణంగా షూటింగ్ రద్దయిందని, చిన్ననాటి ఇష్టమైన ప్రదేశంలో మధ్యాహ్నం పూట ఇలా ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల తన ఎనర్జీ రీఛార్జ్ అయిందని తెలిపారు. అంతేకాకుండా, ఈ అందమైన ఫొటోను తన సతీమణి, ప్రముఖ నటి రష్మిక మందన్న తీశారంటూ ఆమెకు ప్రత్యేకంగా క్రెడిట్ ఇవ్వడం విశేషం. ఈ దంపతుల అన్యోన్యతను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విజయ్, రష్మిక జోడీ ఆన్ స్క్రీన్‌పై కూడా మరోసారి సందడి చేయడానికి సిద్ధమవుతోంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పీరియాడికల్ డ్రామా ‘రణబాలి’ చిత్రంలో ఈ రియల్ లైఫ్ కపుల్ ఆన్ స్క్రీన్‌పై జంటగా నటిస్తున్నారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న మూడవ సినిమా ఇది కావడం గమనార్హం.