నెలసరి సమయంలో మహిళల ఇబ్బందుల గురించి చెప్పాల్సిన పనిలేదు. నొప్పి, తిమ్మిరి వేధిస్తుంటాయి. కొందరిలో ఫుడ్ క్రేవింగ్స్ కూడా కనిపిస్తుంటాయి. కానీ, ‘అది తినొద్దు.. ఇది తినొద్దు!’ అనే అపోహలు కూడా ఉంటాయి. అయితే, ఇలాంటి సమయంలో కొన్ని రకాల పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. ఇవి నొప్పి, తిమ్మరిని తగ్గించడంతోపాటు ఫుడ్ క్రేవింగ్స్నూ కంట్రోల్ చేస్తాయని చెబుతున్నారు.
యాపిల్ : ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు.. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తాయి. ఫైబర్ పుష్కలంగా లభించడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
బొప్పాయి : ఇందులో విటమిన్ ఎ, పపైన్ అనే ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి పీరియడ్స్ సమయంలో వచ్చే హార్మోనల్ సమస్యలను దూరం చేస్తాయి. అయితే, రోజుకు 150 గ్రాముల కన్నా తక్కువగా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అరటిపండ్లు : కొందరిలో పీరియడ్స్ సమయంలో తిమ్మిర్లు వేధిస్తుంటాయి. వాటిని తగ్గించడంలో అరటిపండ్లలోని ‘బోరాన్’ సమర్థంగా పనిచేస్తుంది. అంతేకాదు.. అరటిలోని పొటాషియం, విటమిన్ బి6 కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. మూడ్ స్వింగ్స్‌ను కంట్రోల్ చేస్తాయి.
పుచ్చకాయ: పీరియడ్ క్రాంప్స్‌ను కంట్రోల్ చేయడంలో పుచ్చకాయ ముందుంటుంది. దీనిలోని మెగ్నీషియం.. కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో సాయపడుతుంది.
పైనాపిల్: ఇందులో లభించే ఎంజైమ్స్.. ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. దీనివల్ల కండరాలకు తగినంత విశ్రాంతి లభిస్తుంది. నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది.
నారింజ: నారింజ పండ్లలో విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి గర్భాశయ కండరాలకు విశ్రాంతిని అందిస్తాయి.