
భువనగిరి అర్బన్, డిసెంబర్ 14 : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థల్లో పని చేస్తున్న రిసోర్స్పర్సన్లు విశిష్ట సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం చేపట్టిన ప్రతి సర్వేలో వారు కీలకంగా వ్యవహరిస్తున్నారు. కొవిడ్ సమయంలో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కీలకపాత్ర పోషించారు. ఇటీవల వారి సమస్యలు తెలుసుకున్న మంత్రి కేటీఆర్ పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వడంతో వెంటనే వారి ఖాతాల్లో 12 నెలల వేతనాన్ని జమ చేశారు. జిల్లా వ్యాప్తంగా 92 మంది రిసోర్స్పర్సన్లు ఉండగా, వీరు 3,027 స్వయం సహాయక సంఘాలు, 92 సంఘ బంధాలకు సేవలందిస్తున్నారు. ఆర్పీల గౌరవ వేతనం నెలకు రూ.4వేల చొప్పున 92 మందికి సంబంధించి రూ.43,90,933 లక్షలను ప్రభుత్వం విడుదల చేయగా వాటిని వారి ఖాతాల్లో జమ చేశారు.
ఇవీ ఆర్పీల సేవలు..
భువనగిరి మున్సిపాలిటీలో 38 మంది, ఆలేరులో 11 మంది, చౌటుప్పల్‌లో 15 మంది, మోత్కూర్‌లో 10 మంది, భూదాన్‌పోచంపల్లిలో 10మంది, యాదగిరిగుట్టలో 8 మంది ఆర్పీలు ఉన్నారు. అదే విధంగా స్వయం సహాయక సంఘాలు ఆలేరులో 332, భువనగిరిలో 1,141, చౌటుప్పల్‌లో 541, మోత్కూర్‌లో 336, భూదాన్‌పోచంపల్లిలో 372, యాదగిరిగుట్టలో 305 ఉండగా, 92 సంఘ బంధాలు ఉన్నాయి. ఇందులో స్వయం సహాయక సంఘాల సభ్యులు 30,270 మంది, 92 సంఘ బంధాల పరిధిలోని 920 మంది సభ్యులను ఆర్పీలు సమన్వయం చేస్తున్నారు. బ్యాంకు లింకేజీ, రుణ చెల్లింపులు, రికార్డుల నమోదు, నివేదికల తయారీలో వీరు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. పట్టణ, గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు.
వ్యాక్సినేషన్లో కీలక పాత్ర..
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్పీలు సమగ్ర కుటుంబ సర్వే, జనాభా లెక్కల సర్వే, స్వచ్ఛ భారత్, హరితహారం, బడి బయట పిల్లల గణన, బతుకమ్మ చీరెల పంపిణీ, పల్స్ పోలియో, సదరం క్యాంపుతోపాటు ఇతర అనేక సర్వేలు చేపట్టారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేయడంలో ముందుంటారు. కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలిచారు. వైరస్ వ్యాప్తిపై ఇతర ప్రభుత్వ సిబ్బందితో కలిసి పనిచేశారు. వైద్య సిబ్బందితో కలిసి కరోనా బాధితులకు మెడికల్ కిట్లు అందించారు. వ్యాక్సినేషన్లోనూ కీలకంగా వ్యవహరించారు. రెండు డోసులు తీసుకున్న వారి ఇండ్లకు వెళ్లి తలుపులు, గోడలకు స్టిక్కర్లు అంటిస్తున్నారు.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
ఆర్పీలకు పెండింగ్ వేతనాలు విడుదల చేయడం అభినందనీయం. రాష్ట్రం ఏర్పడ్డాక మా సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాం. మా వినతిని స్వీకరించి ప్రత్యేక చొరవతో పెండింగ్ వేతనాల విడుదలలో కీలకపాత్ర పోషించిన కేటీఆర్‌కు, వేతనాలు విడుదల చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
-కె.శమంతకమణి, ఆర్పీ, భువనగిరి
సంవత్సరం వేతనాలు జమ
ప్రభుత్వం ఏ పని అప్పగించినా వాటితోపాటు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంలో ఆర్పీలు ముందుంటారు. అలాంటి వారి వేతనాల చెల్లింపు అనివార్య కారణాలతో పెండింగ్ పడ్డాయి. ప్రభుత్వం విడుదల చేసిన వేతనాలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇప్పటికే వారి ఖాతాల్లో జమ చేశాం.
-శిరమగళ్ల రమేశ్‌బాబు, మెప్మా జిల్లా అధికారి