e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home News నెల గడుస్తలేదు!

నెల గడుస్తలేదు!

 • 80 శాతం మందిది ఇదే మాట
 • ఆర్థిక ఇబ్బందులకు కారణాలివీ..
 • జీవన వ్యయం (కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌) పెరుగడం
 • ఇతరులను చూసి గొప్పలకుపోయి అనవసరంగా ఖర్చు చేయడం
 • ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం
 • విలాస వస్తువులు కొనుగోలు చేసి అనవసర ఈఎంఐలు పెట్టుకోవడం

‘ఒకటో తారీఖు కోసం నెలంతా ఎదురుచూస్తాం.. అది వరద బాధితుల కోసం వచ్చే హెలికాప్టర్‌లాగా ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది’ నెల జీతం గురించి ఓ సినిమాలోని డైలాగ్‌ ఇది. ఒక్క మాటలో వేతన జీవుల జీవితాలకు అద్దం పట్టింది కదూ. ఓ తాజా సర్వేను చూస్తే కూడా అచ్చూ పరిస్థితి ఇలాగే ఉంది మరి.

ఈవై, రిఫైన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
నెల గడుస్తలేదు.. వచ్చిన జీతం కడదాకా మిగుల్తలేదు.. నెలనెలా ఇంకొకరి దగ్గర చేయి చాపాల్సిందే.. ఇది మన దేశంలోని వేతన జీవుల మనోగతం ఇప్పుడు. చిరుద్యోగి దగ్గర్నుంచి.. అధికారి వరకు అందరూ ఇంతేనంటే అతిశయోక్తి కాదు మరి. అవును.. ‘పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి’ అన్నట్లుగా ప్రతీ ఉద్యోగికి ఎదో ఒక ఆర్థిక సమస్యే. ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌ (ఈవై), రిఫైన్‌ సంస్థలు కలిసి చేసిన సర్వేలో మా జేబులో వేసుకునే జీతాలు అస్సలు చాలట్లేదని మెజారిటీ ఉద్యోగులు వాపోయారు. ఖర్చులు పెరుగుతున్నాయి.. జీతాలు మాత్రం పెరుగుతలేవన్నారు. అయితే కనీస జీతం తీసుకునే ఆఫీస్‌ బాయ్‌ దగ్గర్నుంచి.. అధిక వేతనం అందుకునే బాస్‌ వరకు ఇలాగే చెప్తుండటం గమనార్హం. అసలు సర్వేలో తేలిందేంటి?.. దానికి పరిష్కారాలు ఏమిటో చూద్దామా..!

- Advertisement -

80% నెలాఖరులోపే పర్సులు ఖాళీ అవుతున్నాయని చెప్పిన ఉద్యోగులు
60% లక్షకుపైగా జీతం వచ్చేవారిలోనూ ఖర్చులకు పైసలు సరిపోవడం లేదన్నవారు
34% జీతం డబ్బులు నెల మధ్యలోనే అయిపోతున్నాయని అంటున్నవారు
15,000 ఇంతకన్నా తక్కువ జీతం పొందేవారు అప్పుల్లో కూరుకుపోతున్నారు
13% వేతనంలో కొంత సొమ్ము పొదుపు చేస్తున్నామని చెప్పినవారు
75% జీతం సరిపోక చదువులు, పెండ్లి, వైద్యం వంటి ఖర్చులకు అప్పులు చేస్తున్నవారు

పెరుగుతున్న ఒత్తిడి

 • జీతాలు సరిపోకపోవడం, అర్థిక క్రమశిక్షణ లేకపోవడంవల్ల మానసిక ఒత్తిడి పెరుగుతున్నది.
 • ఆదాయ, వ్యయాల ఆలోచనతో 51% మంది ఒత్తిడికి లోనవుతున్నారు.
 • ఎవరైనా జీతం గురించి మాట్లాడితే ఒత్తిడికి గురవుతున్నామని 38% మంది తెలిపారు.
 • ఎక్కువ మంది క్రెడిట్‌ కార్డులు, లోన్లు, ఈఎంఐల చెల్లింపుల గురించే ఆలోచిస్తున్నారు.
 • సంపాదన సరిపోక ఇల్లు కొనలేకపోతున్నామని, పెట్టుబడి పెట్టలేకపోతున్నామని, అత్యవసర సమయాల్లో చేతిలో డబ్బు ఉండటం లేదని ఎక్కువమంది బాధపడుతున్నారు.

పరిష్కారాలేంటి?
ఆదాయ-వ్యయాలపై అంచనా
ప్రతీ ఒక్కరికీ వారి ఆదాయ-వ్యయాలపై ఓ అంచనా తప్పక ఉండాలి. ముఖ్యంగా మనం పెట్టే ప్రతీ ఖర్చును ఒక్కసారి నిశితంగా గమనించాలి. అప్పుడే అది అవసరమైనదా?, అనవసరమైనదా? అనేది తెలుస్తుంది. ఏదైనా కొనే ముందు అది మనకు ఎంతవరకు ఉపయోగం, ఇప్పుడే కొనాలా? అన్నదానిపై స్పష్టత తెచ్చుకోవాలి. దీనివల్ల నెలసరి వ్యయా లు చాలావరకు తగ్గిపోతాయి.
పొదుపు తప్పనిసరి
సరైన పద్ధతిలో పొదుపును అవలంభిస్తే.. ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగానే బయటపడవచ్చు. చాలామంది ఖర్చులు పెరుగుతున్నాయని, పొదుపును పక్కన పెట్టేస్తారు. ఇది అస్సలు మంచి లక్షణం కాదు. మీ స్థోమతకు తగ్గట్లుగా దాచుకునే ప్రతీ రూపాయి కూడా ఆపత్కాలంలో ఎంతో ఆసరాగా ఉంటుందన్న విషయం మరువరాదు.
రుణాల జోలికి పోవద్దు
మితిమీరిన రుణాలు.. ఆర్థిక సంక్షోభానికి దారితీస్తాయి. సరైన ఆదాయం లేనప్పుడు.. అప్పుల జోలికి వెళ్లడం అత్యంత ప్రమాదకరం. దీనివల్ల మీ పరపతి దెబ్బతింటుంది. క్రెడిట్‌ స్కోర్‌ పడిపోయి అవసరమైనప్పుడు రుణాలు లభించవు. ఫలితంగా పిల్లల చదువు, సొంతిల్లు వంటి భారీ లక్ష్యాలకు ఇబ్బందులు ఏర్పడతాయి.
ఆర్థిక క్రమశిక్షణ అవసరం
ఎవరికైనా ఆర్థిక క్రమశిక్షణ ఎంతో అవసరం. రాబడి-ఖర్చుల తేడాను గుర్తించి నడుచుకోవడమే చక్కని ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం. ఆడంబరాలకు దూరంగా ఉంటూ, పొదుపునకు పెద్దపీట వేయాలి.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement