మాస్కో, మే 4: ఉక్రెయిన్పై అణ్వాయుధాలను ఉపయోగించే అవసరం తలెత్తదని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. ఈ పరిస్థితి ఏర్పడదని తాను ఆశిస్తున్నట్టు స్పష్టం చేశారు. తాజాగా రష్యా అధికారిక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ వివాదానికి తార్కిక ముగింపు తీసుకురావడానికి రష్యా వద్ద తగిన బలముందని ఆయన పేర్కొన్నారు. రష్యన్ భూభాగాలపై ఉక్రెయిన్ దాడుల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ‘ఆ దేశంపై అణ్వాయుధాన్ని ప్రయోగించాల్సిన అవసరం రష్యాకు లేదు. 2022లో ప్రారంభించిన యుద్ధాన్ని రష్యా కోరుకునే విధంగా ముగించడానికి మా వద్ద తగిన బలం, వనరులు ఉన్నాయి’ అని చెప్పారు. 2024 నవంబర్లో రష్యా అణు సిద్ధాంతం పునరుద్ధరణ పత్రాలపై సంతకం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద అణు ఆయుధగారాన్ని ఉపయోగించుకోవడానికి వీలు కల్పించే పరిస్థితులను ఆయన వివరించారు.