న్యూఢిల్లీ: ఇటీవల రిలీజైన వివాదాస్పద చిత్రం ద కేరళ స్టోరీని ఎవరూ చూడడం లేదని, ప్రేక్షకులు లేని కారణంగానే ఆ చిత్రాన్ని థియేటర్లే తప్పించాయని తమిళనాడు ప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టుకు తెలిపింది. తమిళనాడు సర్కార్ తమ చిత్రంపై బ్యాన్ విధించినట్లు ద కేరళ స్టోరీ నిర్మాతలు సుప్రీంలో పిటీషన్ వేశారు. ఆ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంలో విచారణ మొదలైంది. ద కేరళ స్టోరీ ఫిల్మ్‌పై బ్యాన్ విధించినట్లు నిర్మాతలు తప్పుగా ప్రచారం చేస్తున్నారని తమిళనాడు ప్రభుత్వం ఆరోపించింది. ఆడియన్స్ లేని కారణంగానే ఆ సినిమాను థియేటర్ల నుంచి తీసివేశారని తన కౌంటర్ అఫిడవిట్లో తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. మే 7వ తేదీ నుంచి స్వచ్ఛంధంగానే ఆ సినిమాను థియేటర్ ఓనర్లు ఎత్తివేసినట్లు తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది. నిరసనలు వెల్లువెత్తుతాయన్న ఉద్దేశంతో తమిళనాడు సర్కార్ తమ చిత్రంపై షాడో బ్యాన్ విధించినట్లు నిర్మాతలు ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలను స్టాలిన్ ప్రభుత్వం కొట్టిపారేసింది ఆ సినిమాను మొత్తం 19 మల్టీప్లెక్సుల్లో రిలీజ్ చేశామని, సినీగోయర్ల క్షేమం కోసం మాల్స్ వద్ద భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.