Dhanush Kalam | భారత రత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా ఒక బయోపిక్ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.. ఇటీవలే ఈ బయోపిక్‌ను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీత, బహుముఖ నటుడు ధనుష్ అబ్దుల్ కలాం పాత్రలో నటించనున్నారు.
కలాం అంటూ ఈ సినిమా రాబోతుండగా.. ‘తానాజీ: ది అన్ సంగ్ వారియర్’, ‘ఆదిపురుష్’ వంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓం రౌత్ ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌కి దర్శకత్వం వహించనున్నారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది ఢిల్లీ ఫైల్స్’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అభిషేక్ అగర్వాల్ (అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్), భూషణ్ కుమార్ (టి-సిరీస్), కృష్ణన్ కుమార్, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సైవిన్ క్వాడ్రాస్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.
అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన దర్శకుడు ఓం రౌత్.. కలాం బయోపిక్ కోసం ధనుష్ కన్నా గొప్ప నటుడు దొరకరని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం ధనుష్ అంగీకరించడం ఆనందంగా ఉందని.. అతడితో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లబోతుంది.