Chiranjeevi | తెలుగు సినిమా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, స్వర్గీయ అల్లు రామలింగయ్య భార్య శ్రీమతి కనకరత్నమ్మ ఆగస్ట్ 30 ఉదయం తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె, తెల్లవారుజామున 2 గంటల సమయంలో కన్నుమూశారు. చిరంజీవి భార్య సురేఖకు ఆమె తల్లి కాగా, కనకరత్నమ్మ మృతితో అల్లు, మెగా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇక ఆమెకి నివాళులు అర్పించేందుకు మెగా హీరోలు అందరు వచ్చారు. పలువురు సినీ ప్రముఖులు సైతం అల్లు అరవింద్ ఇంటికి వచ్చి కనకరత్నమ్మ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి అయితే ఉదయం నుంచి అక్కడే ఉన్నారు .ఆమె అంతిమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాక, తన అత్తమ్మ పాడెను స్వయంగా మోసారు.
ఇంతటి బాధాకర పరిస్థితిలో కూడా చిరంజీవి చూపిన సామాజిక బాధ్యత ఎంతగానో ప్రేరణనిచ్చే విధంగా మారింది. ఓ హాస్పిటల్ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ, “అత్తగారు కన్నుమూశారని తెల్లవారుజామున సమాచారం వచ్చింది. ఆ సమయంలో మా బ్లడ్ బ్యాంక్ అధినేత స్వామి నాయుడుకు కాల్ చేసి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో టెక్నిషియన్స్ ని కనుక్కోమని చెప్పాను. ఈ లోపు నేను ఆవిడ ఐ డొనేషన్ కి అంతా రెడీ చేస్తాను అని చెప్పడం జరిగింది. అయితే వాళ్లు రెడీగా ఉంటారు వస్తారు అని చెప్పడంతో నేను వెంటనే అరవింద్ కు కాల్ చేసి ఇలా ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని చెప్పాను.
నాకు అత్తమ్మ గారికి, మా అమ్మ గారికి మధ్య ఒక సారి ఇదే విషయంపై చర్చ జరగగా, అప్పుడు ‘ మీరు ఇస్తారా’ అని అడిగాను. కాలి బూడిద అయ్యే శరీరానికి చచ్చిపోయాక ఏం చేస్తాం అలాగే నీ ఇష్టం ఇచ్చేద్దాం అన్నారు. ‘అవయవదానం గురించి మా అత్తమ్మ ఎక్కడా సంతకం పెట్టలేదు కానీ నాకు ఆ మాటే ప్రతిజ్ఞ లాగా అనిపించింది. ఇదే విషయమై ‘ఏం చేయమంటావ్’ అని అరవింద్ ను అడిగితే ఓకే అని అనడంతో, ఆమె కళ్లను తీసి ఆస్పత్రికి పంపించాం అని చిరంజీవి చెప్పుకొచ్చారు.అంతేకాక చిరంజీవి తన మొబైల్లో ఉన్న ఐ డొనేషన్‌కు సంబంధించిన ఫోటోలను కూడా మీడియాకు చూపించారు. ఈ సంఘటనపై పలువురు ప్రముఖులు స్పందిస్తూ, కనకరత్నమ్మ గారి సేవా భావాన్ని, చిరంజీవి తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడుతున్నారు.