నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 14: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ అపార్ట్మెంట్లో దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసిన ఓ ఇంట్లోకి చొరబడ్డ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డుకు సమీపంలో ఉన్న పృథ్వీ అపార్ట్మెంట్లోకి సోమవారం అర్ధరాత్రి దాటాక 3.30 గంటలకు ముగ్గురు దొంగలు ప్రవేశించారు. ఒకరు పార్కింగ్ ప్రాంతంలో కాపలా ఉండగా, ఇద్దరు మొదటి అంతస్తులో చోరీ చేసేందుకు వెళ్లారు. తాళం వేసి ఉన్న ఒక ఫ్లాట్‌ను గుర్తించారు. అలికిడి అయితే చుట్టుపక్కల ఉన్నవారు బయటికి రాకుండా వారి ఇండ్లకు గడియ పెట్టేశారు.
అనంతరం తాళం పగులగొట్టి లోనికి చొరబడ్డారు. కొంత సేపటికి దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. మంగళవారం ఉదయం తమ ఇండ్లకు గడిడపెట్టినట్లు తెలుసుకున్న యజమానులు.. ఇతరుల సహాయంతో బయటికి వచ్చారు. పక్కనే ఉన్న ఫ్లాట్ తాళాలు ధ్వంసమై కనిపించడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు అపార్ట్‌మెంట్‌కు వచ్చి సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించగా, ముగ్గురు దొంగలు వచ్చినట్లు రికార్డయ్యింది. దొంగతనం జరిగిన ఇంటి సభ్యులు కొన్నిరోజుల క్రితమే ముంబైకి వెళ్లగా.. పోలీసులు వారికి సమాచారం అందజేశారు. ఇంట్లో ఎంత సొత్తు పోయిందో యజమాని వచ్చి పరిశీలిస్తే తెలుస్తుందని, అప్పుడే పూర్తి వివరాలను వెల్లడిస్తామని రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు.