రైతన్న ఆశలు ఆవిరవుతున్నాయి. వేములవాడ మండలంలో చెరువులు, కుంటలు అడుగంటిపోతున్నాయి. ఒకప్పుడు పుష్కలమైన జలాలతో కళకళలాడిన జలవనరులు, కాంగ్రెస్ ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యంతో రెండు సీజన్లుగా నీరు లేక వెలవెలబోతున్నాయి. ఇటీవల ఎల్లంపల్లి బరాజ్ నుంచి కేవలం మూడు, నాలుగు చెరువులకు మాత్రమే నీటిని తరలించి చేతులు దులుపుకోవడంతో, మిగిలిన 13 చెరువులు ఎండిపోయాయి. భూగర్భ జలాలు పడిపోయి, బావులు, బోర్లు ఎత్తిపోతున్నాయి. ఫలితంగా సాగునీటి కష్టాలు తీవ్రమై, సాగుకు నీరందక పొలాలు నెర్రెలు బారుతుండగా, రైతులు ఆగమవుతున్నారు. వెంటనే నీటిని తరలించాలని వేడుకుంటున్నారు.
వేములవాడ రూరల్, మార్చి 16: వేములవాడ రూరల్ మండలంలోని మూడు పెద్ద చెరువులు, 14 చిన్న చెరువుల కింద దాదాపు 8వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది. అయితే వానకాలంలో ఇబ్బంది లేకున్నా యాసంగిలో మాత్రం పూర్తిస్థాయిలో నీరందించలేని దుస్థితి ఉన్నది. ఈ క్రమంలో ఏడాదిన్నర కిందటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి బరాజ్ నుంచి నీటిని తరలించి చెరువులు నింపి పంటలకు పుష్కలంగా నీరందించింది. ఎల్లంపల్లి నుంచి గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్‌కు నీటిని తరలించేది. అక్కడి నుంచి ఫాజుల్‌నగర్ చెరువుకు సరఫరా చేసి, లింక్ కెనాల్ ద్వారా చందుర్తి మండలంలోని మల్యాల, బండపల్లి రిజర్వాయర్లను నింపేది. ఈ లింక్ కెనాల్‌కు అనుసంధానంగా ఉన్న చిన్నకాలువల ద్వారా మండలంలోని చెరువులన్నీ నిండేవి. పొలాలకు పుష్కలంగా నీరందేది. అయితే ప్రభుత్వం మారడంతో పట్టింపు కరువైంది. ఎల్లంపల్లి నుంచి ఏదో తూతూమంత్రంగా మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ఇదే క్రమంలో రైతుల విజ్ఞప్తి మేరకు ఇటీవల ఎల్లంపల్లి నుంచి నీటిని వదిలి నమిలిగుండుపల్లిలోని వంకసముద్రం, నూకలమర్రిలోని లింగంచెరువు, ఊరచెరువు, వెంకటాంపల్లిలోని కరీదుకుంటను నింపగానే, కాలువ ఎండిపోయింది. మిగిలిన చెక్కపల్లిలోని కొండ చెరువు, ఎదురుగట్లలోని ఊర చెరువు, లక్ష్మీదేవికుంట, అచ్చనపల్లిలోని కొత్తచెరువు, బాలరాజుపల్లిలోని భవానికుంట, కుమ్మరికుంట, నాగయ్యపల్లిలోని నాగుల కుంట, బడికుంట, ఎర్రకుంట, గుండ్లకుంటతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న కోనాయపల్లి, శాత్రాజుపల్లి గ్రామాల్లోని చెరువుల్లోకి నీరు రాక వెలవెలబోయాయి. చుక్కనీరు లేక అధ్వానంగా కనిపిస్తున్నాయి.
యాసంగికి ఎల్లంపల్లి నుంచి నీరు వస్తుందని రైతులు నమ్మి పుష్కలంగా వరి సేద్యం చేశారు. కానీ, ప్రభుత్వం కేవలం నాలుగు చెరువు లు మాత్రమే నింపడంతో మిగిలిన చెరువుల కింద రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. చెరువుల్లో నీరు లేని కారణంగా భూగర్భజలాలు పడిపోయి బోర్లు, బావులు వట్టిపోయాయి. మరో 20 రోజుల్లో పంట చేతికి వచ్చే సమయంలో పంట ఎండిపోతుండడంతో రైతన్న కన్నీరుమున్నీరవుతున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మండలంలోని దాదా పు అన్ని చెరువులు నింపారని, కానీ, ఇప్పుడు పట్టించుకునేవారే లేరని ఫలితంగా పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.