వందో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ వంద కొట్టాలని కోరుకున్న వారి ఆశలు ఫలించలేదు! మైలురాయి మ్యాచ్‌లో కోహ్లీ చక్కటి ఇన్నింగ్స్ ఆడగా.. మూడో స్థానంలో విహారి ఆకట్టుకున్నాడు. ఆఖర్లో రిషబ్ పంత్ మెరుపులు మెరిపించడంతో లంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతున్నది.
మొహాలీ: యావత్ ప్రపంచం విరాట్ వందో మ్యాచ్‌లో శతకం సాధించాలని ఆకాంక్షిస్తున్న వేళ.. తొలి టెస్టు ఆడుతున్న పిల్లాడిలా కాస్త ఒత్తిడిలో మైదానంలో దిగిన కోహ్లీ (45; 5 ఫోర్లు).. తొలి ఇన్నింగ్స్‌లో అభిమానుల ఆశలు నెరవేర్చలేకపోయాడు. చక్కటి ఇన్నింగ్స్ ఆడినా.. దాన్ని మూడంకెల స్కోరుగా మలచలేకపోయాడు. టాపార్డర్ మొత్తం తలాకొన్ని పరుగులు చేయడంతో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతున్నది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన.. శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (97 బంతుల్లో 96; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) తృటిలో శతకం చేజార్చుకోగా.. మూడో స్థానంలో బరిలోకి దిగిన తెలుగు ఆటగాడు హనుమ విహారి (58) అర్ధశతకంతో అలరించాడు. మయాంక్ అగర్వాల్ (33), రోహిత్ శర్మ (29) మెరుగైన ఆరంభం అందించగా.. విహారితో కలిసి విరాట్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. శ్రేయస్ అయ్యర్ (27) ఎక్కువసేపు నిలువలేకపోగా.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (45 బ్యాటింగ్) అర్ధశతకానికి చేరువయ్యాడు. అతడితో పాటు అశ్విన్ (10) క్రీజులో ఉన్నాడు.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 357/6 (పంత్ 96, విహారి 58; ఎంబుల్దెనియా 2/107).