Mallikarjun Kharge : ప్రస్తుతం వెనెజువెలా (Venezuela) లో నెలకొన్న పరిస్థితి ఈ ప్రపంచానికి మంచిది కాదని కాంగ్రెస్ పార్టీ (Congress Party) జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఈ ప్రపంచంలోని జనాభాను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు.
ఎవరు రాజ్య విస్తరణకు ప్రయత్నించినా దాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేరని ఖర్గే అన్నారు. హిట్లర్, ముస్సోలినీ లాంటి వాళ్లు కూడా అలాంటి ప్రయత్నాలు చేసి కనుమరుగై పోయారని చెప్పారు. కొంతమంది కుటిల ఆలోచనలతో ప్రపంచ శాంతిని చెడగొట్టేందుకు ప్రయత్నించడం మంచిది కాదని అన్నారు. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య శాంతిని నెలకొల్పడంలో తాను కీలక పాత్ర పోషించానని ట్రంప్ ఎప్పుడూ చెబుతుంటాడని, ఇప్పటివరకు దాదాపు 70 సార్లు ఈ విషయం చెప్పాడని తెలిపారు.
ఈ ప్రపంచంలో తానే అత్యంత గొప్ప వ్యక్తినని, ఈ ప్రపంచం తనముందు మోకరిల్లుతుందనేది ట్రంప్ మాటలకు అర్థమని ఖర్గే చెప్పారు. కానీ ట్రంప్ ముందు మోకారిల్లాల్సిన అవసరం ఈ ప్రపంచానికి లేదని అన్నారు. మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామని, ప్రజాస్వామ్య పద్ధతిలోనే ముందుకు పోతామని వ్యాఖ్యానించారు. ‘బతుకు, బతుకనివ్వు’ అనేది నెహ్రూ పాలసీ అని, అదే మా పాలసీ కూడా అని చెప్పారు.
ఇవాళ ట్రంప్ మాట్లాడిన ఒక ఆడియో విన్నానని, ‘మోదీకి నేనంటే గౌరవమని, నా మాట వింటాడని నాకు తెలుసు’ అన్నది ఆ ఆడియో సారాంశమని ఖర్గే అన్నారు. అంటే మోదీ తన కంట్రోల్లో ఉన్నాడనేది దీని అర్థమా..? అని ఆయన ప్రశ్నించారు. మోదీ ఎందుకు ట్రంప్ ముందు బెండ్ అవుతున్నాడో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ఇది దేశానికి ప్రమాదకరమని చెప్పారు. నిన్ను ప్రజలు ప్రధానిగా ఎన్నుకున్నది ట్రంప్ చెప్పినట్లు తలూపడానికి కాదని అన్నారు.