Shikhar Dhawan : భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఆయన తన ప్రియురాలు సోఫీ షైన్ ను వివాహమాడనున్నారు. వచ్చే ఫిబ్రవరి మూడో వారంలో, ఢిల్లీలో ఘనంగా వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెళ్లి వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని శిఖర్ సన్నిహితులు చెబుతున్నారు. ఇక సోఫీ షైన్ ఐర్లాండ్ దేశస్తురాలు.
శిఖర్, సోఫీ కొన్నేళ్లక్రితం దుబాయ్ లో కలుసుకున్నారు. వారి పరిచయం స్నేహంగా, అనంతరం ప్రేమగా మారింది. వీరిద్దరూ కొంతకాలం నుంచి డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇటీవలే వీరి రిలేషన్ ను సోషల్ మీడియా వేదికగా బయటపెట్టుకున్నారు. ఇద్దరూ తాము కలిసున్న ఫొటోల్ని షేర్ చేసుకున్నారు. దీంతో వీరి బంధాన్ని అధికారికంగా ప్రకటించుకున్నట్లైంది. అయితే, శిఖర్ కు గతంలోనే వివాహం జరిగింది.
ఆస్ట్రేలియాకు చెందిన అయేషా ముఖర్జీని శిఖర్ వివాహం చేసుకోగా, వారికి జొరావర్ ధావన్ అనే 11 ఏళ్ల కొడుకు ఉన్నాడు. కొంతకాలం క్రితం విడాకులు తీసుకున్నారు. ఇక.. శిఖర్, సోఫీ వివాహానికి పలువురు క్రికెటర్లతోపాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. శిఖర్ ధావన్ చివరగా 2024 ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు.