ఒక యువకుడు నది ఒడ్డున కూర్చుని ఉన్నాడు. అక్కడే చాలా కుక్కలు తిరుగుతూ ఉన్నాయి. ఆ యువకుడు చేతిలోకి కొన్ని రాళ్లను తీసుకుని కనిపించిన ప్రతి కుక్కనీ కొడుతున్నాడు. దెబ్బతిన్న కుక్కలు ‘కుయ్ కుయ్’ అని అరుస్తూ పరుగులు తీస్తున్నాయి. అప్పుడే ఒక పండితుడు అటుగా వెళ్తూ ఉన్నాడు. ఆ యువకుడు చేసే నిర్వాకం చూసి పండితుడు కొద్దిసేపు అక్కడే ఆగాడు. ‘ఎందుకు వాటిని కారణం లేకుండా కొడుతున్నావ’ని అడిగాడు. ‘అవి ఎదురు తిరగవు కదా, అందుకు కొడుతున్నాను. అయినా అది నా ఇష్టం. కుక్కలను కొట్టే స్వేచ్ఛ కూడా నాకు లేదా?’ అని ఎదురు ప్రశ్న వేశాడు. పండితుడు అతని కళ్లలోకి చూస్తూ ‘ఎదురు తిరగవని ఆ మూగ జీవాలను కొట్టడం ఎంతవరకు సమంజసం? అయినా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నావు. స్వేచ్ఛ అంటే ఇది కాదు. పక్కనే పారుతున్న నదిని చూసి తెలుసుకో’ అన్నాడు. నదిని చూసిన యువకుడు ‘నదికేమి? తనకు ఇష్టం వచ్చిన దిశగా, స్వేచ్ఛగా ఉరకలేస్తూ ప్రవహిస్తున్నది’ అని సమాధానమిచ్చాడు. ‘నదికి ఆ పక్కన ఏముంది?
ఈ పక్కన ఏముంది?’ అని అడిగాడు పండితుడు. అది కూడా తెలియదా అన్నట్లుగా ‘ఆ పక్క ఒక ఒడ్డు, ఈ పక్క ఒక ఒడ్డు ఉంది’ అని నీరసంగా బదులిచ్చాడు యువకుడు. ‘అదే నేను చెప్పేది. రెండు ఒడ్డుల మధ్య ఉండటమనేది దానికున్న పరిమితి. ఒడ్డులే లేకపోతే అది నదీ కాదు, దాని స్వేచ్ఛకూ అర్థం లేదు. నువ్వు ఇంకో విషయం గమనించాల్సింది ఏమిటంటే మనం ఆ పక్క నుంచి ఈ పక్కకి, ఈ పక్క నుంచి ఆ పక్కకీ వెళ్లాలంటే ఈ ఒడ్డులనేవి ఉంటేనే సాధ్యం. అంతే కాకుండా రెండు ఒడ్డుల మధ్యన నది ప్రవహిస్తూ ఉంటే అందంగా ఉంటుంది. అదే నది, ఒడ్డులు దాటి ప్రవహిస్తే అల్లకల్లోలం అవుతుంది’ అని వివరించాడు. ‘క్రమశిక్షణతో ఉన్నప్పుడే స్వేచ్ఛకు విలువ. మన జీవితంలో కూడా స్వేచ్ఛకు పరిమితులున్నాయి’ అని గుర్తించి కుక్కలని కొట్టడం మానుకున్నా డు ఆ యువకుడు.