Tata Motors | దేశీయ ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ భారత ఆటోమొబైల్ రంగంలో తాజాగా ఓ మైలురాయి సాధించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో కంపెనీ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా రిటైల్ అమ్మకాలతో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇదే సమయంలో మార్కెట్లో ఇప్పటికే కీలక స్థానంలో ఉన్న మారుతీ సుజుకీ తన ఆధిపత్యాన్ని మరింత చాటగా.. హ్యుందాయ్, కియా వంటి ఇతర కంపెనీలు అమ్మకాల్లో వెనుకబడ్డాయి. వాహన్ పోర్టల్ విడుదల చేసిన లెక్కల ఆధారంగా ఈ సమాచారం వెల్లడైంది. స్పష్టంగా చెప్పాలంటే సెప్టెంబర్‌లో టాటా మోటార్స్ 40,594 కార్లను విక్రయించింది. అందులోనూ నెక్సాన్ మోడల్ విపరీతంగా డిమాండ్ ఉన్నది.
ఈ ఒక్క మోడల్‌నే 22,500 యూనిట్లకుపైగా అమ్ముడయ్యింది. కంపెనీ మార్కెట్ వాటా 11.52 శాతం నుంచి 13.75 శాతానికి పెరిగింది. ఇదిలా ఉంటే.. ప్యాసింజర్ వాహనాల్లో మారుతీ సుజుకీ దూసుకెళ్లింది. మొత్తం 1,23,242 యూనిట్లు విక్రయించి, మార్కెట్లో 41.17 శాతం వాటాను సొంతం చేసుకుంది. గతేడాదితో పోలిస్తే సంస్థ విక్రయాల్లో, వాటాలో స్వల్ప మెరుగుదల కనిపించింది. ఇక మూడోస్థానాన్ని స్థానాన్ని మహీంద్రా అండ్ మహీంద్రా దక్కించుకుంది. థార్, స్కార్పియోకు డిమాండ్ రాగా.. 37,659 కార్లు విక్రయించి 12.58 శాతం వాటా సాధించింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈసారి మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. గత సంవత్సరం ఇదే సమయంలో 38,833 కార్లు అమ్మిన సంస్థ.. ఈ సెప్టెంబర్‌లో మాత్రం 35,812 యూనిట్ల అమ్మకాలకే పరిమితమైంది.
దీంతో కంపెనీ మార్కెట్ షేర్ 13.72 శాతం నుంచి 11.96 శాతానికి పడిపోయింది. అలాగే కియా ఇండియా, టయోటా కిర్లోస్కర్ మోటార్స్ తమ మార్కెట్ వాటాను కోల్పోయాయి. దేశవ్యాప్తంగా ప్యాసింజర్ కార్ల మొత్తం అమ్మకాలు ఈ నెలలో 6 శాతం పెరిగి 2,99,369 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో మోటోకార్ప్ తన మార్కెట్ హోల్డింగ్‌ను 22.48 శాతం నుంచి 25.1 శాతానికి పెంచుకుంటూ ముందంజ వేసింది. మరోవైపు, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన వాటాను 27.7 శాతం నుంచి 25.05 శాతానికి కోల్పోయింది. టీవీఎస్ మోటార్ సంస్థ మాత్రం మార్కెట్ వాటాలో పురోగతి సాధించింది. మొత్తం మీద టూవీలర్ అమ్మకాలు 6.5 శాతం వృద్ధి చెందినట్లుగా డేటా తెలిపింది.