తిరుపతి : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను(Brahmotsavams) విజయవంతం చేసిన స్ఫూర్తితో తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలను, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి వేడుకలను విజయవంతం చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్( EO Anil Kumar Singhal) తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల తర్వాత నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు కల్పించిన సౌకర్యాలపై గ్యాలరీలు, క్యూలైన్లలోని భక్తులు వందశాతం సంతృప్తిని వ్యక్తం చేశారని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలలో గ్యాలరీలలోను, క్యూలైన్లలోను, గరుడ సేవ రోజు ప్రణాళికా బద్ధంగా ప్రతి ఒక్క భక్తుడికి అన్నప్రసాదాలు అందించేలా, ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేందుకు పారిశుద్ధ్య పనులు చేశారని ప్రశంసించారు.
ఆకట్టుకునేలా విద్యుత్ కాంతులు, పుష్ప అలంకరణలు, రవాణా, ట్రాఫిక్, తదితర సేవలలో అందరూ చిత్తశుద్ధితో పనిచేశారన్నారు. వచ్చే బ్రహ్మోత్సవాలకు సీసీ కెమెరాలను అనుసంధానం చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్, రియల్ టైం ఫీడ్ బ్యాక్ తీసుకుని భక్తుల ఇబ్బందులను అంచనా వేసి అందుకు తగ్గ ఏర్పాట్లు చేపట్టేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలకు ప్రణాళికాబద్ధంగా సౌకర్యాలు కల్పించేలా మూడు నెలల ముందు నుంచే ప్రణాళికను రూపొందించామన్నారు. బ్రహ్మోత్సవాలపై ప్రతి అంశాన్ని నమోదు చేసుకుని రాబోవు రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. జేఈవో వి వీరబ్రహ్మం , జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, సివిఎస్వో కె.వి. మురళీకృష్ణ, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.