కొద్దిరోజులుగా కేసులు నమోదు కాకపోవడంతో కరోనాపై ప్రజల్లో భయం తగ్గింది. దీంతో కొవిడ్ నిబంధనలు పాటించడం లేదు.చాలామంది మాస్కులు ధరించడం మానేశారు. చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతికదూరం అసలే పాటించడం లేదు. కాగా, ఇంకా కరోనా ముప్పు తొలగలేదని, కొత్త వేరియంట్లు వెలుగు చూస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో మూడు రోజులుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. పటాన్చెరు మండలంలోని ముత్తంగి, ఇంద్రేశంలోని జ్యోతిరావు పూలే పాఠశాలల్లో 75 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, తాజాగా శనివారం మరో 19 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దడ పుట్టిస్తుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని, వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో ఉమ్మడి మెదక్ జిల్లాలో వైద్యాధికారులు వ్యాక్సినేషన్ వేగిరం చేశారు.
సంగారెడ్డి, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ): ప్రాణాంతక కరోనాపై ప్రజల్లో భయం తగ్గింది. కరోనా పూర్తిగా తగ్గిందని జనం కొవిడ్ నిబంధనలు పాటించడం లేదు. కొద్దిరోజులుగా కరోనా కేసుల తీవ్రత లేకపోవడంతో జనం మాస్క్‌లు ధరించడం మానేశారు. చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతికదూరం పాటించడం లేదు. ఇంకా కరోనా ముప్పు తొలగలేదని, థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో రెండు, మూడు రోజులుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. పటాన్చెరు మండలంలోని ముత్తంగి, ఇంద్రేశంలోని జ్యోతిరావు పూలే పాఠశాలల్లో చదువుతున్న వేర్వేరు జిల్లాలకు చెందిన 75 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం కలకలం సృష్టించింది. ఇందులో పది మంది విద్యార్థులు సంగారెడ్డి జిల్లాకు చెందిన వారు ఉన్నారు. దీంతో కరోనా ముప్పు పొంచిఉంది. దీనికి తోడు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దడ పుట్టిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
పరీక్షల సంఖ్య పెంచిన వైద్య ఆరోగ్యశాఖ..
సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం కరోనా కేసులు పెద్ద సంఖ్యలో లేవు. కొన్ని నెలులుగా జిల్లాలో కరోనా కేసులు నమోదు కాలేదు. వారం రోజులుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. పటాన్చెరు మండలం ముత్తంగి, ఇంద్రేశం గ్రామాల్లోని జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. గురుకుల పాఠశాలల్లో వేర్వేరు జిల్లాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పిల్లలకు కరోనా సోకినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ముత్తంగి, ఇంద్రేశంలోని జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాలలో 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో సంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థులు 10 మంది ఉన్నారు. పది మంది ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్సపొందుతున్నారు. కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య అధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. కరోనా కేసులను అడ్డుకట్ట వేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ పరీక్షల సంఖ్యను పెంచారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ఆర్టీపీసీఆర్ కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచారు. సంగారెడ్డి, పటాన్చెరు, జోగిపేట, జహీరాబాద్, సదాశివపేట, నారాయణఖేడ్ ప్రభుత్వ దవాఖానలతో పాటు జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో ర్యాపిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా కిట్లు అందుబాటులో ఉంచారు. జలుబు, జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
వ్యాక్సినేషన్ వేగవంతం.. థర్డ్‌వేవ్ ఎదుర్కొనేందుకు సన్నద్ధం..
ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వైద్య ఆరోగ్యశాఖ వేగవంతం చేసింది. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 13,91,985 మంది వ్యాక్సినేషన్ చేశారు. ఇందులో 9,26,646 మంది మొదటి డోస్ వేసుకోగా, 4,65,339 మంది రెండో డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారు. ఈనెల 31 వరకు జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. సంగారెడ్డి జిల్లాలో 1067 ఆక్సిజన్ బెడ్లు సిద్ధంగా ఉంచారు. సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో వెయ్యిలీటర్ల సామర్థ్యం ఉన్న ఆక్సిజన్ జనరేషన్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. పటాన్చెరు, సదాశివపేట, జహీరాబాద్, జోగిపేట, నారాయణఖేడ్ ప్రభుత్వ దవాఖానల్లో 500 లీటర్ల సామర్థ్యం ఉన్న ఆక్సిజన్ ప్లాంట్లను సిద్ధంగా ఉంచారు. అన్నివిధాలుగా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉంది.
అప్రమత్తంగా ఉందాం..
కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాల్సిన అవసరమున్నది. తద్వారా మహమ్మారిని సమర్థవంతంగా తిప్పికొట్టవచ్చు. మాస్క్ తప్పనిసరిగా ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలి. క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవాలి. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తదితర లక్షణాలు కనిపించిన వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే మేలు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేషన్ కావడం లేదా దవాఖానల్లో చేరి చికిత్స పొందాలి.
కొవిడ్ నిబంధనలు మరిచిన జనం…
ఉమ్మడి మెదక్ జిల్లాలో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించడం లేదు. చాలామంది మాస్క్‌లు ధరించడం మానేశారు. ప్రభుత్వ ఆదేశాలతో శుక్రవారం సంగారెడ్డి జిల్లాలో పోలీసులు మాస్క్ ధరించని వారిని గుర్తించి జరిమానాలు విధించారు. శుక్రవారం జిల్లాలో 100 మందికి జరిమానాలు విధించారు. జనం భౌతికదూరం పాటించడం లేదు. చేతులు శానిటైజేషన్ చేసుకోవడం లేదు. కొవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో కరోనా బారిన పడవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇతర దేశాల్లో కొత్త వేరియంట్ వ్యాపిస్తున్న నేపథ్యంలో మనం కూడా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని, జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోంది. అయినా అనేక మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అప్రమత్తత కనిపించడం లేదు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించడంతో పాటు రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకోవడం తప్పనిసరి. ఇలా చేస్తే కరోనాను తరిమికొట్టడం సాధ్యమవుతుంది.
ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి
సంగారెడ్డి మున్సిపాలిటీ, డిసెంబర్ 3: కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ వైరస్ ప్రబలుతున్నందున ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటికి వచ్చే సమయంలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గాయత్రీదేవి అన్నారు. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’తో ఆమె మాట్లాడుతూ కరోనా, థర్డ్ వేరియంట్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ మాస్క్, సామాజిక దూరం, వ్యక్తి గత శుభ్రత పాటించాలని కోరారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకోని వారు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. కరోనా నుంచి రక్షణ పొందాలంటే ప్రభుత్వ సూచనలు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇప్పటి సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరులో కేసులు పెరుగుతున్నాయని వాటిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు మెలగాలన్నారు. జిల్లాలో గత నెల నవంబర్ 20వ తేదీ నుంచి ఇప్పటివరకు 1,224 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా, 29 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని, వీరందరూ హోం క్వారంటైన్లో చికిత్సలు పొందుతున్నారని తెలిపారు. ర్యాపిడ్ పరీక్షలు 3,912 మందికి నిర్వహించగా, ఇందులో 101 మందికి పాజిటివ్ అని తేలిందన్నారు. వీరు కూడా చికిత్సలు పొందుతున్నారని వివరించారు. సీజనల్ వ్యాధుల్లో జ్వరం, జలుబు, దగ్గు వస్తుంటాయని, రెండు మూడు రోజుల కంటే జ్వరం ఎక్కువగా ఉంటే, పొడి దగ్గు వస్తే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలని కోరారు.