దిలావర్పూర్ : ప్రభుత్వ అధికారుల్లో మానవత్వం ఉంటుందని నిరూపించారు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ తహసీల్దార్. అనేక అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ నడవలేని స్థితిలో తన భూమి సమస్యను విన్నవించేందుకు లోలం గ్రామానికి చెందిన కన్న ముత్తన్న ( Farmer Kanna Muttanna ) అనే రైతు ఆటోలో తహసీల్ కార్యాలయానికి వచ్చాడు. తన సమస్యను చెప్పుకునేందుకు కార్యాలయంలోనికి నడిచి వెళ్లేందుకు చేతకాకపోవడంతో ఆటోలోనే కూర్చుండిపోయాడు.
ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ ( Tahsildar ) ఎజాజ్ అహ్మద్ ఖాన్ ( Ejaj Ahmed Khan) స్వయాన రైతు వద్దకు వెళ్లి సమస్యను తెలుసుకున్నారు. రైతు చెప్పిన విషయాలను తెలుసుకుని సంబంధిత కింది స్థాయి అధికారుల ద్వారా రికార్డులను తెప్పించి పరిశీలించారు. రైతు ద్వారా పూర్తి సమాచారాన్ని తీసుకుని సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో రైతు సంతోషంగా వెనుదిరిగారు.