హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): అవకాశాలు నింగిలోనూ ఉంటాయన్న ఆలోచనతో ‘స్కైరూట్’ పేరుతో హైదరాబాద్‌లో స్టార్టప్‌ను ఏర్పాటు చేసిన ఐఐటియన్లు డాకా నాగభరత్, చందన పవన్‌కుమార్.. పెట్టుబడుల గురించి ఆలోచించకుండా చౌకగా అంతరిక్షానికి చేరుకొనే మార్గాలను అన్వేషించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు వీరి ఆలోచనలు కార్యరూపం దాల్చడంతో ఆవిష్కరణలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. ఫలితంగా స్కైరూట్‌కు పెట్టుబడులు వాటంతట అవే వస్తున్నాయి. తాజాగా ఈ స్టార్టప్ కంపెనీ నోబెల్ పురస్కార గ్రహీత సీవీ రామన్ పేరిట 3డీ ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్‌ను రూపొందించి విజయవంతంగా పరీక్షించింది. తద్వారా దేశంలో ఈ ఘనత సాధించిన తొలి ప్రైవేటు కంపెనీగా రికార్డులకెక్కింది. సంప్రదాయ రాకెట్ ఇంజిన్లతో పోలిస్తే స్కైరూట్ ఇంజిన్ బరువు సగం కంటే తక్కువగా ఉన్నప్పటికీ సామర్థ్యం మాత్రం ఒకేలా ఉంటుంది. ఈ రాకెట్ ద్వారా ఒకేసారి అనేక ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెట్టవచ్చు.
ఇద్దరి ఆలోచనలూ ఒక్కటే
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ (మెకానికల్ ఇంజినీరింగ్) పూర్తిచేసిన పవన్‌కుమార్ క్యాంపస్ రిక్రూట్మెంట్లోనే శాస్త్రవేత్తగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో ఉద్యోం సంపాదించాడు. అలాగే మద్రాస్ ఐఐటీలో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చదివిన నాగభరత్కు కూడా ఇస్రోలో శాస్త్రవేత్తగా ఉద్యోగం లభించడంతో ఇద్దరూ అక్కడే రాకెట్ సైన్స్‌పై పట్టు సాధించారు. పెద్ద ఉపగ్రహాల ప్రయోగాల కోసం ఇస్రో తయారుచేసే భారీ రాకెట్లకు భిన్నంగా చిన్న, మధ్యస్థాయి ఉపగ్రహాలకు అవసరమైన రాకెట్లను తయారు చేయడం లాభదాయకమని ఆలోచించి అనుకొన్నదే తడవుగా స్కైరూట్ స్టార్టప్‌ను స్థాపించారు.
చిన్న ఉపగ్రహాలకు ఉజ్వల భవిత
పెద్ద రాకెట్లు 50 మీటర్ల కంటే ఎక్కువ పొడవుతో ఉంటాయి. చిన్న రాకెట్ల పొడవు 20-30 మీటర్లలోపే ఉంటుంది. రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ల కోసం ఎక్కువగా చిన్న రాకెట్లనే ఉపయోగించాల్సి వస్తుంది. మున్ముందు చిన్న ఉపగ్రహాలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే నమ్మకంతోనే మేము చిన్న రాకెట్ ఇంజిన్లను తయారు చేస్తున్నాం. వీటికి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉండడంతో నిరంతరం ప్రయోగాలు కొనసాగిస్తున్నాం. ప్రైవేటు రంగంలో అంతరిక్ష కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తుండటంతో రాకెట్ ఇంజిన్ల తయారీపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాం.
తొలి 3డీ ప్రింటెడ్ బైప్రొపెల్లెంట్ లిక్విడ్ ఇంజిన్ మాదే
అంతరిక్ష రంగంలో ప్రైవేటు కంపెనీలకు మంచి భవిష్యత్తు ఉటుందన్న ఆలోచనతో స్కైరూట్‌ను ప్రారంభించాం. దేశంలో తొలి 3డీ ప్రింటెడ్ బైప్రొపెల్లెంట్ లిక్విడ్ ఇంజిన్ రాకెట్ మాదే. సంప్రదాయ రాకెట్ ఇంజిన్ల కంటే దీని బరువు 50% తక్కువగా ఉంటుంది. దీని ద్వారా ఉపగ్రహాల ప్రయోగానికి అయ్యే వ్యయం భారీగా తగ్గుతుంది. ఈ ఇంజిన్ ప్రయోగం విజయవంతమవడంతో మరింత స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం. మా ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్తులో చిన్న ఉపగ్రహాలను ప్రయోగించేందుకు మా కంపెనీ రూపొందించే రాకెట్లతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి.