న్యూఢిల్లీ: లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ (పోక్సో) చట్టం దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు రోమియో-జూలియట్ క్లాజ్‌ను చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తెలిపింది. బాలిక టీనేజర్ అయినపుడు, ఇష్టపూర్వకంగా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్న వారిని ఈ చట్టం నుంచి కాపాడటానికి ఇది అవసరమని పేర్కొంది.
పోక్సో చట్టం కింద కేసుల్లో బెయిలుపై విచారణ దశలో బాధితురాలి వైద్యపరమైన వయసు నిర్ధారణను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇవ్వరాదని హైకోర్టులకు తెలిపింది. ఇష్టపూర్వకంగా లైంగిక సంబంధాలను ఏర్పాటు చేసుకున్న వారికి రేప్ చట్టాల నుంచి మినహాయింపు ఇచ్చేదే రోమియో-జూలియట్ క్లాజ్. ఈ సంబంధాలు ఏర్పరచుకున్న వారిలో ఒకరు సమ్మతి తెలియజేయడానికి తగిన లీగల్ ఏజ్ కన్నా తక్కువ వయసు గల వారు అయినప్పటికీ ఈ మినహాయింపు లభిస్తుంది.