కారేపల్లి (కామేపల్లి), జనవరి 9: కామేపల్లి మండలం తాళ్ల గూడెం గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తల భూములపై అక్రమంగా చేపట్టిన రోడ్డు పనులను తక్షణమే నిలిపి వేయాలని బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ డిమాండ్ చేసింది. కొంతమంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలను టార్గెట్ చేసిన వారి భూముల గుండా అక్రమంగా రోడ్డు వేయాలనే ఉద్దేశంతో పనులు ప్రారంభించాడాన్ని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తీవ్రంగా ఖండించింది.
బిచ్చాలా తిరుమలరావు ఆధ్వర్యంలో బల్లెబోయిన వలరాజు, చింతల వెంకటేశ్వర్లు, చేకూరి ముక్తేశ్వరావులతో కూడిన బీఆర్ఎస్ లీగల్ సెల్ బృందం తాళ్లగూడెం చేరుకొని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించింది. అనంతరం పంచాయితీరాజ్ డీఈతో మాట్లాడి పట్టాదారులైన రైతుల అనుమతి లేకుండా అధికార పార్టీ ఒత్తిళ్లతో రోడ్డు పనులు ప్రారంభిస్తే చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. అక్రమ రోడ్డు పనులను అడ్డుకున్న రైతు వంశి పై తప్పుడు కేసులు బనాయించి గత రెండు రోజులుగా పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉంచడం దుర్మార్గమని మండిపడ్డారు. వంశీని తక్షణమే విడుదల చేయాలని పోలీసులను కోరగా.. వారు వెంటనే పంపిస్తామని హామీ ఇచ్చినట్లు బీఆర్ఎస్ లీగల్ సెల్ తెలిపింది.
ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.