హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : దేశ రక్షణ సామర్థ్యాలకు తోడ్పాటునందించడంలో మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ అధికారుల పాత్ర కీలకమని ఎంసీఆర్హెచ్ఆర్డీ డైరెక్టర్ డాక్టర్ శశాంక్ గోయల్ పేర్కొన్నారు. నూతనంగా మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్ ఫౌండేషన్ కోర్సును సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కోర్సును పుణెలోని కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజినీరింగ్ స్పాన్సర్ చేసినట్టు తెలిపారు. ఎంఈఎస్ కేవలం వ్యక్తికి సంబంధించినది కాదని, మన దేశ రక్షణ సంసిద్ధతతను అత్యున్నత స్థాయిలో ఉంచే జట్టు నాయకుడి పాత్ర అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ ఆర్అండ్డీ అడిషనల్ చీఫ్ ఇంజినీర్ జే సతీశ్ భరద్వాజ, సీడీఎస్ కోర్సు డైరెక్టర్ అండ్ హెడ్ కందుకూరి ఉషారాణి, అకడమిక్ కోఆర్డినేటర్ అబ్బాస్ అలీ, అడిషనల్ కోర్సు డైరెక్టర్ కే చంద్రజ్యోతి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, జనవరి 6 (నమస్తేతెలంగాణ): ఉమెన్ సేఫ్టీపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు ఉమెన్ సేఫ్టీ వింగ్ డైరెక్టర్ జనరల్ శిఖాగోయల్ వెల్లడించారు. ఇందుకు ఉప్పల్, నాగోల్, రామంతాపూర్ జిల్లా పరిషత్ స్కూళ్లను పైలట్ ప్రాజెక్టుగా ఎంపికచేసినట్టు సోమవారం పేర్కొన్నారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ డైరెక్టర్ ఆఫీసులో పోస్టర్లను ఆవిష్కరించారు. 1,036 మంది విద్యార్థినులకు పలు అంశాలపై అవగాహన కల్పించనున్నట్టు పేర్కొన్నారు. స్మితాహెగ్డే, శోభన ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.