హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావును ఇరికించేందుకే రేవంత్ సర్కార్ రెండో సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) వేసిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. 2024 మార్చిలో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఒక పోలీస్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారని ఆయన విమర్శించారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చట్టబద్ధంగా జరిగే ట్యాపింగ్‌ను నేరంగా చిత్రీకరిస్తున్నారనే విషయాన్ని చాలాసార్లు చెప్పానని ఆయన గుర్తుచేశారు.
దేశంలో, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. దేశ భద్రత కోణంలో ట్యాపింగ్ చేస్తారని, ఈ విషయాన్ని స్వయంగా రేవంత్‌రెడ్డి కూడా ఒప్పుకొన్న విషయాన్ని ప్రవీణ్ ప్రస్తావించారు. టెలిగ్రాఫ్ యాక్టు-1885 ప్రకారమే ట్యాపింగ్ జరిగిందని, అలాంటప్పుడు పోలీస్‌స్టేషన్‌లో కేసు ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసినప్పుడు విచారణ జరుపాలని తేల్చిచెప్పారు.
కానీ లేని ఆధారాలు తీసుకొచ్చి, రాజకీయ నేతలను ఇరికించడం చట్టవ్యతిరేకమని నిప్పులుచెరిగారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 350మందిని విచారించారని ఆగ్రహించారు. పోలీస్ అధికారి ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో ఊరట కలిగిందని, బెయిల్‌ను అడ్డుకొంటూ ఒక ఐపీఎస్ అధికారిని 18రోజుల పాటు కరుడు కట్టిన నేరస్తుడిలా ట్రీట్ చేశారంటూ ప్రవీణ్ నిప్పులు చెరిగారు.
ఫోన్ ట్యాపింగ్‌పై ఇప్పటివరకు చార్జ్‌షీట్ ఫైల్ చేయలేదని, ఇందులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ పేర్లు చేర్చాలని పోలీస్‌లపై సీఎం రేవంత్‌రెడ్డి ఒత్తిడి తెస్తున్నారని ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సంధ్య శ్రీధర్‌రావుపై 26 కేసులు ఉన్నాయని, అతనితో ఎమ్మెల్సీ నవీన్‌రావు పేరు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ట్యాపింగ్ కేసులో సీనియర్ జర్నలిస్టును ఇరికించారని, అతను సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తే హరీశ్‌రావు పేరు చెప్తావా? లేదా? అని బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రస్తుత నివాసంలో కాకుండా, దుర్మార్గంగా నందినగర్‌లో ఉన్న ఇంటి గోడలపై నోటీసులు అంటించి, ఫోన్‌ట్యాపింగ్ కేసులో వారిని విచారించిన తీరును తీవ్రంగా తప్పుపట్టారు.
వాస్తవంగా ఫోన్‌ట్యాపింగ్ అనేది చాలా రహస్యంగా ఉంటుందని, బాధ్యతలేని హోం మంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో పోలీసులు తప్పులు చేస్తున్నారని ఆరెస్పీ విమర్శించారు. దీని వల్ల పోలీసు అధికారుల ప్రాణాలు ప్రమాదంలో పడుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. తెలుగు స్ర్కైబ్ ఆన్లైన్ మీడియా చానల్ నిజాలు నిర్భయంగా సోషల్ మీడియాలో వీడియోలు పెడుతుంటే.. టెర్రరిస్టుల సమాచారం సేకరించాల్సిన ఒక డిపార్ట్మెంట్ అధికారి ‘ఎక్స్'(ట్విట్టర్)కు లేఖ రాశారని, ఆ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నదని దుయ్యబట్టారు. దీనిని దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు ఖండించారని తెలిపారు. ఆ లెటర్ రాసిన అధికారి ఎవరో లష్కరే తోయిబాకు, ఆల్‌ఖైదాకు తెలువదన్న గ్యారెంటీ ఏమిటని నిలదీశారు.
ప్రపంచంలో ఉండే ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలకు తెలియదు అన్న గ్యారెంటీ ఏదైనా ఉన్నదా? అని మండిపడ్డారు. ఆ డిపార్టుమెంట్‌ను ప్రమాదంలోకి నెట్టివేసినట్టే కాదా? అని హెచ్చరించారు. సర్కార్ పెడుతున్నవన్నీ అక్రమ కేసులేనని.. తప్పుడు విచారణ చేసే వారిపై చర్యలు తప్పవని స్పష్టంచేశారు. నంబి నారాయణన్ అనే ఇస్రో సైంటిస్టుపై అక్రమ కేసు మోపినందుకు విచారణ చేసిన వాళ్లను కోర్టు దోషులుగా ప్రకటించిందనే విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని ఆగ్రహించారు. పోలీస్ రూల్స్, మ్యానువల్స్, ఇల్లీగల్ ఆదేశాలు పాటించవద్దని పోలీసు అధికారులను సూచించారు.
కేటీఆర్, హరీశ్‌రావు ఇండ్ల ముందున్న సీసీ కెమెరాలు హ్యాక్ కేటీఆర్, హరీశ్‌రావు ఇండ్ల ముందున్న సీసీ కెమెరాలను కాంగ్రెస్ సర్కార్ హ్యాక్ చేస్తున్నదని ప్రవీణ్ ఆరోపించారు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకొచ్చి, ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని వీటిపైనా సిట్ వేసి విచారణ జరుపాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో రైతుల పరిస్థితి హృదయ విదారకంగా ఉన్నదని, ప్రభుత్వం పంటలు కొనుగోలు కొనకపోవడం దారుణమని ప్రవీణ్ మండిపడ్డారు. ఈ సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నట్టయితే ఢిల్లీ మెడలు వంచేవారని స్పష్టంచేశారు.
అమృత టెండర్లలో రూ.1,980 కోట్లు అప్పనంగా కేవలం రాఘవ కన్స్ట్రక్షన్స్కే ఇచ్చారని, మరి ఆ యజమాని ఎస్సీనా? ఎస్టీనా? బీసీనా? కంపెనీ డైరెక్టర్లలో ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారని ప్రవీణ్ ప్రశ్నించారు. ఇందులో రేవంత్‌రెడ్డి వాటా ఎంతో చెప్పాలని నిలదీశారు. రుత్విక్ కన్‌స్ట్రక్చన్స్‌కు రూ.4వేల కోట్లు ఇచ్చారని అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. ఈ దుర్మార్గం మీద సిట్ వేయాలి కదా? అని ధ్వజమెత్తారు. గురుకుల పాఠశాలలకు రూ.2వేల కోట్లు ఇచ్చారు.
వారిలో ఏయే సామాజిక వర్గానికి చెందన వారు ఎందరున్నారని ప్రశ్నించారు. లేని ఆధారాలు సృష్టించవద్దని హెచ్చరించారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత అందరిపైనా విచారణ జరుగుతుందని హెచ్చరించారు. అయితే కాంగ్రెస్ వాళ్లు నమోదు చేస్తున్న కేసులను ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. గతంలో తనకు యాపిల్ ఫోన్ నుంచి వచ్చిన మెసేజ్‌ను సెంట్రల్ క్రైమ్ పోలీసులకు ఇచ్చానని పేర్కొన్నారు.