హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు ఏప్రిల్ రెండో వారంలో విడుదలకానున్నాయి. ఏప్రిల్ 8,10,12 తేదీల్లో ఏదో ఒక రోజు ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆయా తేదీల్లో ఫలితాల వెల్లడికి ప్రభుత్వ అనుమతి కోరారు. ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం ఆదివారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని క్యాంపుల్లో మూల్యాంకనం ముగియడంతో ఫలితాల క్రోడీకరణ పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు.
అయితే ఈ సారి సమాధాన పత్రాల రీ వెరిఫికేషన్ చేయించనున్నారు. సింగిల్ సబ్జెక్టు ఫెయిలైన వారితోపాటు ఒక్కో సబ్జెక్టులో కొన్ని జవాబుపత్రాలను ర్యాండమ్‌గా వెరిఫికేషన్ చేయించనున్నారు. ఆ తర్వాత సీజీజీలో ట్రయల్స్ నిర్వహించి అంతా సవ్యంగా ఉంటేనే ఫలితాలు విడుదల చేస్తారు. వాస్తవానికి ఏప్రిల్ 6వ తేదీనే ఫలితాలు విడుదల చేయాలని భావించినా, బడ్జెట్ సమావేశాలు, ఇతర పనులతో రెండో వారానికి వాయిదావేశారు.