న్యూఢిల్లీ, మే 13: కేంద్ర ప్రభుత్వానికి రిజర్వుబ్యాంక్ ఈసారి కూడా రికార్డు స్థాయిలో డివిడెండ్ చెల్లింపులు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్న మోదీ సర్కార్కు 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను రికార్డు స్థాయిలో డివివెండ్ చెల్లించే అవకాశం ఉన్నదని రిజర్వు బ్యాంక్ వర్గాలు వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి ఆర్బీఐ రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్ చెల్లింపులు జరిపింది. అంతక్రితం ఏడాది చెల్లించిన రూ.2.11 లక్షల కోట్ల కంటే ఇది 27 శాతం అధికం.
ఈ డివిడెండ్ చెల్లింపులపై ఈ నెల రిజర్వు బ్యాంక్ బోర్డు సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. ఆర్బీఐ వద్ద మిగులు నగదు నిల్వలు అధికంగా ఉండటంతో వీటిని కేంద్రానికి డివిడెండ్ రూపంలో చెల్లింపులు జరుపుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో ఈసారి రిజర్వుబ్యాంక్తోపాటు ప్రభుత్వ బ్యాంకులు, ఆర్థిక ఇనిస్టిట్యూట్లు కలిపి రూ.3.16 లక్షల కోట్ల డివిడెండ్ చెల్లింపులు జరిపే అవకాశం ఉన్నదని తెలిపింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.3.21 లక్షల కోట్ల ఆపరేటింగ్ లాభాన్ని ఆర్జించాయి.