
రామచంద్రాపురం, డిసెంబర్ 3 : మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని, చాలా రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని బ్రిటీష్ డిప్యూటీ కమిషనర్లు అండ్రూ ఫ్లెమింగ్, డెవిస్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జీహెచ్ఎంసీ భారతీనగర్ డివిజన్‌ను వారు సందర్శించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సింధూఆదర్శ్‌రెడ్డి వారికి ఘన స్వాగతం పలికారు. ముందుగా ఎల్‌ఐజీలోని వార్డు కార్యాలయంలో సమావేశమై ఇక్కడి ఆచారాలు, సంప్రదాయాలు, రుచుల గురించి కార్పొరేటర్ వారికి వివరించారు. అనంతరం ఎల్‌ఐజీలోని ఈశ్వరంభ మహిళా సొసైటీ ఏర్పాటు చేసిన డిజైన్ డెవలప్మెంట్ వర్క్‌షాప్‌ను వారు సందర్శించారు. వర్క్‌షాప్‌లో మహిళలు తయారు చేసిన డిజైన్ దుస్తులను పరిశీలించి అభినందించారు. ఎల్‌ఐజీలో జరుగుతున్న మహిళా భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడి నుంచి ఓల్డ్ ఎంఐజీలో ఇందిరా గాంధీ మహిళా మండలిని సందర్శించేందుకు వెళ్లిన వారికి, మహిళా సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్పొరేటర్ సింధూ ఆదర్శ్‌రెడ్డి వారికి శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా అండ్రూ ఫ్లెమింగ్, డెవిస్ మాట్లాడారు. మహిళలకు సామాజిక భద్రత అవసరమన్నారు. రాజకీయాల్లోనూ మహిళల ప్రాతినిధ్యం పెరగాలని అన్నారు. భారతీనగర్ డివిజన్ అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా స్వావలంబన సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. స్వయం సహాయక సంఘాలతో ఆర్థిక తోడ్పాటును ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. సృజనాత్మకత, కొత్త ఆలోచనలతో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సలహాదారు నలినీ, డివిజన్ అధ్యక్షుడు బూన్, కార్యదర్శి నారాయణరెడ్డి, నాయకులు యాదగిరిరెడ్డి, పాపయ్య, నర్సింహా, గిరి, మహిళా సంఘాల సభ్యులు తదితరులు ఉన్నారు.