తెలంగాణ కులవృత్తుల్లో కల్లు గీతకు విశిష్ట స్థానమున్నది. ఇక్కడి ప్రజల సాంస్కృతిక జీవనంలో కల్లు ఓ భాగం కావడమే అందుకు కారణం. పొలాల్లో, చెలకల్లో ఉండే ఎత్తైన చెట్లను ఎక్కి కల్లు గీయడం ఓ సాహసం, దినదిన గండం. అయినా వృత్తిలో భాగంగా గౌడన్నలు అనునిత్యం చెట్లు ఎక్కుతూనే ఉంటారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి కిందకు పడి ప్రాణాలు కోల్పోవడం, దివ్యాంగులు కావడం జరుగుతుంటుంది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన గత రెండేండ్ల కాలంలో 850 మంది చెట్ల మీద నుంచి పడితే వారిలో 160 మందికి పైగా చనిపోయారు. మరో 180 మంది శాశ్వత దివ్యాంగులుగా మారారు. మరో 500 మంది వరకూ తీవ్ర గాయాల పాలయ్యారు. అయినా రాష్ట్ర సర్కార్‌లో ఉలుకూపలుకూ లేకపోవడం విడ్డూరం. 2024 జూలైలో సీఎం రేవంత్‌రెడ్డి ఇదిగో ఇప్పుడే ఎక్స్‌గ్రేషియా కోసం ఆదేశాలిస్తున్నామంటూ చెప్పారు. 20 నెలలైనా దాని గురించి అతీగతీ లేకపోవడం గమనార్హం. ఈ తీరు గీత కార్మికుల పట్ల సర్కార్ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘అందరికీ అన్నీ’ అంటూ అరచేతిలో స్వర్గం చూపింది కాంగ్రెస్. అడ్డగోలు హామీలతో ఊరించింది. బీసీల కోసం ప్రత్యేకించి కామారెడ్డి డిక్లరేషన్ విడుదల చేసింది. గౌడన్నలకు అప్పటివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న ఎక్స్‌గ్రేషియా రూ.5 లక్షలను రూ.10 లక్షలకు పెంచుతామని అందులో భరోసా ఇచ్చింది. కానీ అసలుకే ఎసరు పెడుతారని గౌడన్నలు బహుశా ఊహించి ఉండరు. వారి పెన్షన్ రూ.4 వేలకు పెంచుతామని, వయోపరిమితిని 57 నుంచి 50 సంవత్సరాలకు తగ్గిస్తామని చెప్పింది. అటు పెన్షన్ పెంచనూ లేదు, ఇటు దరఖాస్తులు స్వీకరించనూ లేదు. చెట్టు మీద నుంచి పడకుండా కాపాడే కాటమయ్య రక్షణ కవచం కిట్లు ఇస్తామని ఆర్భాటంగా హామీ ఇచ్చింది. 2.2 లక్షల మంది సభ్యులుంటే అందులో పదో వంతు మందికి కూడా ఇవ్వలేదు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇది పూర్తిగా రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం కిందకు వస్తుందని చెప్పక తప్పదు.
స్వరాష్ట్ర సాధన తర్వాత ప్రథమ ముఖ్యమంత్రిగా రాష్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన కేసీఆర్.. కులవృత్తుల అభ్యున్నతికి అపూర్వమైన రీతిలో ప్రణాళికలు రూపొందించి అమలు చేశారు. ముఖ్యంగా గీత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చొరవ చూపారు. ఎక్స్‌గ్రేషియాను రూ.2 లక్షల నుంచి ఒక్కసారిగా రూ.5 లక్షలకు పెంచారు. పాక్షిక వైకల్యానికి రూ.2 లక్షలు, పూర్తి వైకల్యానికి రూ.5 లక్షల పరిహారం అందించాలని నిర్ణయించారు. అధికార మార్పిడి జరిగిన 2023 లోనూ బీఆర్ఎస్ సర్కార్ 312 మంది బాధితుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిందన్న సంగతి ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మొండిచెయ్యి చూపుతుండటం బాధాకరం. కేసీఆర్ హయాంలో మద్యం షాపుల్లో గౌడన్నలకు 15 శాతం రిజర్వేషన్‌ను కల్పించిన విషయం తెలిసిందే. దానిని 25 శాతానికి పెంచుతామని, జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడుతామని హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ ఉసూరుమనిపిస్తున్నది.
గీత కార్మికుల సంక్షేమానికి రూ.5 వేల కోట్లివ్వాలని సంఘాలు డిమాండ్ చేస్తే కేటాయించింది రూ.70 కోట్లు. అందులో ఖర్చు చేసింది అయిదో వంతు కూడా ఉండదు. ఆ మిగిలిన నిధులను ఈ మార్చి నెలాఖరులోగా ఖర్చు చేయకపోతే అవీ డుల్ల అవుతాయి. ట్యాంక్‌బండ్‌పై నీరా కేఫ్‌ను మూసేయడమే కాకుండా, నందనంలోని నీరా ప్రాసెస్ యూనిట్లో పనులను ప్రభుత్వం నిలిపివేసింది. మరోవైపు నామినేటెడ్ పదవుల్లోనూ గీత కార్మిక సామాజిక వర్గాన్ని చిన్నచూపే చూస్తున్నది. కాంగ్రెస్ పాలనలో గీతన్నల సంక్షే మం హళ్లికి హళ్లి, సున్నకు సున్న అన్నట్టుగా తయారైంది. ఈ నేపథ్యంలో తమ డిమాండ్ల సాధనకు గౌడన్నలు నిరాహార దీక్ష చేపట్టాల్సి రావడం దురదృష్టకరం. ఓటుకోసం కాంగ్రెస్ అరచేతిలో స్వర్గం చూపించి, అధికారం దక్కగా నే హామీలను అటకెక్కించింది. గౌడన్నలకు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా నెరవేర్చకపోతే రాష్ట్ర సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.