కెరీర్ తొలినాళ్లలో అవకాశాల కోసం ఎంతో శ్రమించానని, దర్శకుల దగ్గరకు వెళ్లి తనకు సూటయ్యే పాత్ర ఉంటే ఇవ్వమని అడిగిన సందర్భాలెన్నో ఉన్నాయని గుర్తు చేసుకుంది అగ్ర కథానాయిక మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఈ భామ దక్షిణాదితో పాటు హిందీలో కూడా సత్తా చాటుతున్నది. 2019లో ‘సూపర్30’తో హిందీలో కథానాయికగా అరంగేట్రం చేసిన ఈ సొగసరి ప్రస్తుతం బాలీవుడ్లో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నది. ఈ సందర్భంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కెరీర్ తొలినాటి రోజుల్ని గుర్తు చేసుకుంది మృణాల్ ఠాకూర్. ‘అవకాశాలు నా దగ్గరకు ఎప్పుడూ రాలేదు. వాటిని నేను సృష్టించుకున్నాను. దర్శకుల దగ్గరకు నేరుగా వెళ్లి మంచి పాత్ర కోసం అభ్యర్థించిన రోజులున్నాయి.
నటనంటే అమితమైన ప్రేమ కాబట్టి ఎలాంటి సంకోచం లేకుండా అవకాశాల కోసం అడిగేదాన్ని’ అని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది. శ్రీదేవి నటించిన ‘మామ్’ సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందని, దర్శకుడు రవి ఉద్యవార్ని కలిసి అలాంటి సీరియస్ కథ ఉంటే తనను పరిగణనలోకి తీసుకోమని కోరానని మృణాల్ తెలిపింది. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో హిందీలో ‘దో దివానే సెహర్ మే’ అనే చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని చెప్పింది. అడివి శేష్‌తో మృణాల్ నటించిన ‘డెకాయిట్’ సినిమా పానిండియా స్థాయిలో త్వరలోనే విడుదల కానుంది.