మనిషికి వస్త్రం కేవలం శరీరాన్ని కప్పే పొర కాదు, అది అతని వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే నిశ్శబ్ద భాష. ‘భయభక్తులు ఉట్టిపడే దుస్తులే అన్నిటికన్నా మిన్న’ అన్న ఖురాన్ సందేశం.. బాహ్య అలంకరణ కంటే అంతర్గత వినమ్రతకే ప్రాధాన్యమిస్తుంది. వస్త్రధారణలో ఆడంబరం అహంకారాన్ని పెంచితే, నిరాడంబరత దైవానికి దగ్గర చేస్తుంది. హదీసుల ప్రకారం, పవిత్రతకు చిహ్నమైన తెల్లని వస్త్రం ధరించడం అత్యంత శ్రేష్ఠం. పురుషులు పట్టు వస్ర్తాలకు, గర్వాన్ని ప్రదర్శించే సుదీర్ఘ దుస్తులకు దూరంగా ఉండాలని, కాలి గిలకల పైకే వస్ర్తాన్ని ధరించాలని ఇస్లాం బోధిస్తున్నది.
ఇది కేవలం పద్ధతి మాత్రమే కాదు, అల్లాహ్ పట్ల చూపే అణకువ. స్త్రీల వస్త్రధారణలో గౌరవం, పురుషుల ప్రవర్తనలో వినయం ప్రతిబింబించినప్పుడే ఆ సమాజం ధర్మబద్ధంగా ఉంటుంది. వాహనాలపై క్రూర మృగాల చర్మాలను వాడకూడదన్న ఆదేశం జీవకారుణ్యాన్ని సూచిస్తే, మరణానంతరం శవపేటికలోనూ తెల్లని వస్త్రమే తోడు రావడం మనిషి అంతిమ నిరాడంబరతను చాటుతుంది. గుర్తుంచుకోండి.. వస్త్రం శరీరాన్ని అందంగా చూపడమే కాదు, మనసులోని గర్వాన్ని అణచివేసి దైవచింతనను పెంచేదిగా ఉండాలి. వినమ్రతే నిజమైన అలంకారం.
– ముహమ్మద్ ముజాహిద్ 96406 22076