శ్రీధర్, కామారెడ్డి : సంక్రాంతికి ముందురోజు భోగి పండుగ చేసుకుంటారు. గోదాదేవి రంగనాథుడిలో లీనమై భోగాన్ని పొందింది ఈ రోజే. దీనికి సంకేతంగా భోగినాడు గోదాదేవి, రంగనాథస్వామి కల్యాణాన్ని నిర్వహిస్తారు. సుఖాలను ప్రసాదించమని భగవంతుణ్ని కోరుకునే రోజు ఇది. సంక్రాంతి వ్యవసాయదారుల పండుగ. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఇంటికి చేరుకున్న ఈ తరుణంలో కష్టాలకు వీడ్కోలు పలుకుతూ తమ ఇల్లు భోగభాగ్యాలతో తులతూగాలని రైతులు కోరుకుంటారు.
ఈ సందర్భంగా ఇన్నాళ్లూ తమను పట్టి పీడించిన దారిద్య్రాన్ని తరిమికొడుతూ, కష్టాలన్నిటినీ అగ్నిలో ఆహుతి చేస్తూ భోగిమంటలను వేయడం ఆచారంగా మారింది. ఈ మంటల వెనుక ఆరోగ్యానికి సంబంధించిన శాస్త్రీయ కోణమూ దాగి ఉంది. దక్షిణాయనంలో అధిక భాగం అనారోగ్యం కలిగించే వాతావరణం ఉంటుంది.
ముఖ్యంగా చలికాలంలో శ్వాస సంబంధమైన రోగాలు వ్యాపిస్తుంటాయి. వాటి నివారణ కోసం ఆవుపేడతో చేసిన పిడకలు, మామిడి, మేడిచెట్ల కొమ్మలతో భోగిమంటలు వేస్తారు. అందులో ఆవునెయ్యి వేస్తారు. భోగిమంటలు వెచ్చదనాన్ని ఇవ్వడంతోపాటు అందులోంచి వెలువడే శక్తి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అందుకే భోగిమంటలకు అంత ప్రాధాన్యం ఏర్పడింది.
– శ్రీ