శ్రీహరికోట, జనవరి 11 : మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి ‘ఇస్రో’ సిద్ధమైంది. పీఎస్ఎల్వీ-సీ62 మిషన్‌తో 2026 ఏడాదిని ప్రారంభిస్తున్నది. సోమవారం ఉదయం 10.17గంటలకు శ్రీహరి కోట మొదటి లాంచ్‌ప్యాడ్ నుంచి ఈ మిషన్‌ను ప్రయోగించబోతున్నది. ఈ ప్రయోగం ద్వారా భూ పరిశీలన శాటిలైట్‌లో అత్యంత అధునాతమైనది ‘ఈవోఎస్-ఎన్1’ (అన్వేష)ను రోదసిలోకి పంపుతున్నారు.
రోదసి నుంచి భారత్ నిఘా సామర్థ్యాల్ని పెంచేదిగా, భూమిపై ఓ కన్నేసి ఉంచటంగా ‘అన్వేష’ను సైంటిస్టులు పేర్కొన్నారు. దీంతోపాటు స్పానిష్ స్టార్టప్ తయారుచేసిన చిన్నపాటి ‘క్యాప్సుల్’ను, మరో 17 దేశవిదేశాలకు చెందిన శాటిలైట్స్‌ను ఇస్రో ఈ మిషన్ ద్వారా నింగిలోకి పంపుతున్నది. దీంట్లో ‘క్యాప్సుల్’ ఒక్కటే దక్షిణ పసిఫిక్ సముద్రజలాల్లో ‘స్లాష్డౌన్’ అవుతుంది.