ఒక ఊర్లో ఓ ఆధ్యాత్మిక గురువు ఉండేవాడు. అతడి కంఠం వినసొంపుగా ఉండేది. ఆధ్యాత్మిక విషయాలను గ్రామీణులకు అర్థమయ్యే భాషలో వివరిస్తూ పిట్ట కథలు చెబుతూ శ్రోతలను మైమరిపింపజేసేవాడు. ఆ చుట్టుపక్కల ఊళ్లలోని వారు ఎద్దుల బండ్లు కట్టుకుని మరీ వచ్చి అతని బోధనలను ఆసక్తిగా వినేవారు. అతని బోధనల విషయం పక్క ఊరిలోని జమీందారుకు తెలిసింది. ‘వినేవాళ్లు ఉంటే చెప్పేవాళ్లకు కరువా! అయినా చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపినోడు కదా గొప్పోడు’ అని గమ్మున ఉండిపోయాడు.
ఎంతో నిరాడంబరంగా ఉండే ఆ గురువు చెప్పడంతోపాటు ఆ విషయాలను తానూ ఆచరించేవాడు. దాంతో అతనికి శిష్యగణం పెరిగింది. గురువు గొప్పతనం తెలుసుకుందామని జమీందారు ఓ ఉదయం బయలుదేరాడు. ఆధ్యాత్మిక గురువు ఇంటి వద్ద జనం గుమికూడి ఉన్నారు. దగ్గరికి వెళ్లి విచారిస్తే గురువు ఇంట్లో దొంగతనం జరిగినట్లు తెలిసింది. దొంగతనం ఎలా జరిగి ఉంటుందోనని అక్కడ ఉన్న జనం కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. ఇంట్లో ఉన్న బంగారు నగలు మొత్తం దొంగలు దోచుకెళ్లినట్లుగా జమీందారుకు అర్థమైంది. పరామర్శించి వద్దామని గురువు దగ్గరికి వెళ్లాడు. గురువు మామూలుగా ఉన్నాడు. అతని ముఖంలో ఏమాత్రం ఆందోళన కనిపించలేదు. ‘అయ్యో… భారీగా నష్టం జరిగింది కదా!’ అన్నాడు జమీందారు.
‘అదేం మాట? దొంగతనం వల్ల నాకేమీ నష్టం జరగలేదు’ అన్నాడు గురువు. ‘అలా అంటారేమిటి? ఉన్న బంగారం అంతా దొంగలు దోచుకెళ్లిపోయారు కదా’ ఆశ్చర్యంగా అడిగాడు జమీందారు. ‘దొంగలు నా జ్ఞానం దోచుకెళ్లలేదు కదా. వారు తీసుకు వెళ్లింది నగలే కదా, వాటిని తిరిగి నేను చేయించాలనుకుంటేనే కదా నష్టం వచ్చేది. లేకపోతే దానివల్ల నష్టమేముంది?’ అని ఎదురు ప్రశ్న వేశాడు. ‘మనకి ఆకర్షణ ఉండాల్సింది వస్తువులు, బంగారు, సంపదల మీద కాదు, జ్ఞాన సముపార్జన మీద’ అని అర్థం చేసుకున్నాడు జమీందారు. చిన్నగా ఆయన బోధనల్ని అనుసరించడం మొదలుపెట్టాడు.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు, 93936 62821