యాదగిరిగుట్ట, జనవరి 11: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటరు జాబితాకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అయితే యాదగిరి గుట్ట మున్సిపాల్టీ పరిధిలోని ఒక్కో ఇంటిపై సుమారు 20 నుంచి 30 మంది ఓటర్ల పేర్లు నమోదై ఉన్నాయి. అయితే ఆ ఓటర్లు స్థానికంగా లేకపోవడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా ఉండని ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారో.. అనే విషయపై అవగాహన లేక, ప్రలోభాలకు గురైన ఓటర్లు తప్పుదోవ పట్టే అవకాశం లేకపోలేదని స్థానికులు మండిపడుతున్నారు. తప్పుల తడకగా ఉన్న ఓటరు జాబితాపై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్న చర్చ జోరుగా సాగుతున్నది. స్థానిక అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి, స్థానికంగా ఉండని వారి ఓట్లను సైతం తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అక్కడే ఉండే ప్రైవేట్ పాఠశాల యజమానితో చీకటి ఒప్పందం కుదుర్చుకొని ఉండవచ్చనే విషయం చర్చకు దారితీస్తోంది.
115 మంది ఓటర్లలో అందుబాటులో ఉన్నది 35 మందే..
యాదగిరిగుట్ట మున్సిపాల్టీలో మొత్తం 12 వార్డులు ఉండగా 13,817 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ప్రధానంగా 6వ వార్డులో సుమారు 1,162 మంది ఉండగా.. ఓటరు జాబితా సవరణతో కొన్ని మార్పులు, చేర్పులు ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే ఇందులో ప్రధానంగా పాతగుండ్లపల్లిలోని బీసీ కాలనీలో ఓ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 3-133 నంబరుపై సుమారు 92 మంది ఓటర్ల పేర్లు నమోదై ఉన్నాయి. ఈ జాబితాలో ప్రధానంగా వలస వచ్చిన వారి పేర్లే అధికంగా ఉండటంతో పాటు వీరిలో చాలా మంది వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లు, వీరు కేవలం ఎన్నికల సమయంలోనే వచ్చి ఓటేసి వెళ్తున్నట్లు అత్యంత విశ్వనీయవర్గాల సమాచారం. వాస్తవానికి మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి 1993లో కొన్ని కుటుంబాలు యాదగిరిగుట్టకు వలస వచ్చాయి.
నాడు బీసీ కాలనీలో 5 గుడిసెలు వేసుకొని ఇక్కడే ఉన్నట్లు రాములు అనే వ్యక్తి తెలిపారు. గ్రామ గ్రామాలు తిరుగుతూ వెంట్రుకలు, నూనె డబ్బాల క్రయ విక్రయాలు చేస్తూ సంచార జీవనం చేస్తూ ఉంటామన్నారు. 1995లో పక్కనే ఓ ప్రైవేట్ పాఠశాలను ప్రారంభించారని, గుడిసెల్లో ఉండేవారికి ఇంటి నంబరు లేకపోవడంతో పాఠశాల నంబరుపైనే పేర్లు నమోదు చేసుకున్నామన్నారు. ప్రస్తుతం 92 మంది ఓటర్లు ఉండగా ఇందులో కేవలం 35 మాత్రమే ఉంటారని సమాచారం. మరికొందరు ఇక్కడే ఉన్న ఇండ్లల్లో అద్దెకు ఉంటున్నారని చెబుతున్నారు. తమ ఓట్ల వివరాలన్నీ ప్రైవేట్ పాఠశాల సారుకు తెలుసని రాములు చెప్పడం కొసమెరుపు.
చర్చనీయాంశంగా ఓటరు జాబితా వ్యవహారం..
మున్సిపాల్టీలోని అన్ని వార్డుల్లో ఓటరు జాబితా తీరు దాదాపుగా తప్పుల తడకగానే ఉంది. ఒక్కో ఇంట్లో దాదాపుగా 20 నుంచి 30 ఓట్లు ఉండటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా 6వ వార్డుల్లో ఉన్న ప్రైవేట్ పాఠశాల నంబరుపై ఉన్న ఓటర్లపై అనుమానాలున్నాయని స్థానిక ప్రజాప్రతినిధులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ముఖ్య నాయకులు స్థానికంగా ఉండని ఓటర్లతో ముందుగానే మాట్లాడుకొని, చీకటి ఒప్పందం చేసుకున్నారనే చర్చ గట్టిగా వినిపిస్తున్నది. ఎన్నికల సమయంలో ఆ ఓటర్లను రప్పించి ఎంతో కొంత ముట్టజెప్పి తమ అభ్యర్థికి ఓట్లు వేయించుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.