కాంగ్రెస్ పాలకుల హామీలు నీటి మూటలుగానే మిగులుతున్నాయి. ఎన్నికల ముందు ‘అది చేస్తాం.. ఇది చేస్తాం’ అని రైతులకు అరచేతిలో వైకుంఠం చూపినా.. ఇప్పుడు విస్మరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇల్లంతకుంట మండలంలో కిలోమీటరున్నర కాలువను ఆర్నెల్లలోగా పూర్తి చేస్తామని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, తాను గెలిచిన ఏడాదిలోగా కొడిమ్యాల మండలంలో ఏడు కిలోమీటర్ల కాలువను పూర్తి చేయిస్తామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్పిన మాటలు ఉత్తవే అయ్యాయి. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా పూర్తి చేయకపోవడంపై ఆయా గ్రామాల రైతులు మండిపడుతున్నారు. సాగునీరందక పంటలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయని కంటతడి పెడుతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు తమ హామీలు నిలబెట్టుకోవాలని, కాలువలు పూర్తి చేయించి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇల్లంతకుంట/ సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 25 : రంగనాయకసాగర్ ఆర్డీ3 ఎల్ఎం 6 కెనాల్ నిర్మాణం కోసం ఇల్లంతకుంట మండలంలోని 12 గ్రామాల రైతులు పోరుబాట పట్టారు. పెద్దలింగాపూర్ శివారులో 16 రోజులు రిలే దీక్షలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో బుధవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇల్లంతకుంట మండల కేంద్రంతోపాటు సిరిసిల్ల జిల్లాకేంద్రంలో ఫ్లెక్సీతో ర్యాలీ తీస్తూ భిక్షాటన చేశారు. కాలువకు నిధులు ఇవ్వలేని కాంగ్రెస్ సర్కారును దయచేసి మీకు తోచినంత దానం చేసి ఆదుకోండి అంటూ వేడుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతులను బిచ్చగాళ్లుగా మార్చిందని ఆవేదన చెందారు. అనంతరం సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల రైతులు మాట్లాడుతూ.. కెనాల్ నిర్మాణం కోసం గతేడాది తాము దీక్ష చేశామని, ఎమ్మెల్యే కవ్వంపల్లి వచ్చి ప్రభుత్వంతో మాట్లాడి 3.20కోట్ల నిధులు మంజూరు చేయించానని, ఆరు నెలల్లో పూర్తిచేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ, ఏడాది గడిచినా తట్టెడు మట్టి తీయలేదని మండిపడ్డారు. కనీసం ఇప్పటి వరకు పనులు ఎందుకు ప్రారంభించడం లేదని, అబద్ధాలతో ఇంకెన్ని రోజులు మోసం చేస్తారని ప్రశ్నించారు. అప్పుడు రైతులను శాంతింప జేయడం కోసం నిధులు వచ్చాయని చెప్పడం ఎమ్మెల్యే ఆడిన నాటకమని ఎద్దేవా చేశారు. కేవలం 3.20 కోట్ల నిధులు విడుదల చేస్తే కిలోమీటరున్నన కాలువ పూర్తవుతుందని, ప్రభుత్వం, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆయన చేతగానితనం వల్లే ఈ పనులు ఆగిపోయాయన్నారు.
తాము సాగు పనులు వదిలి పదహారు రోజులుగా దీక్షలు చేస్తున్నా ఏ ఒక్కరూ కన్నెత్తి చూడడం లేదని వాపోయారు. పైగా దీక్షాస్థలి వద్ద టెంట్‌ను సైతం కూలగొట్టి రైతుల దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నించినా మొక్కవోని ధైర్యంతో దీక్షను కొనసాగిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎవరికీ భయపడేది లేదని, కాలువ నిర్మాణం కోసం తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. కాలువ పనులు వెంటనే చేపట్టి రైతులను ఆదుకోవాల కోరారు. లేదంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఆయాచోట్ల రైతులు నవీన్‌కుమార్, మేడుదుల ఎల్లయ్య, మందాటి తిరుపతి, అత్మకూరి అనిల్, గాదె మధు, పయ్యావుల బాలయ్య, గణపురం శ్రీనివాస్, జక్కుల కొమురయ్య, తదితరులు ఉన్నారు.
రైతులను మోసం చేసిన్రు
రైతులను రాజును చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు కనీసం పట్టించుకుంట లేదు. ఇల్లంతకుంట మండలంలో రాష్ర్టానికే గుండెకాయలాంటి శ్రీ రాజరాజేశ్వర, అన్నపూర్ణ ప్రాజెక్టులు ఉన్నాయి. పక్కనే రంగనాయక సాగర్ ప్రాజెక్టు ఉంది. కానీ, మా పన్నెండు గ్రామాలకు నీటి సౌకర్యం లేదు. గతేడాది సాగునీటి కొరత తీర్చాలని పెద్దలింగాపూర్ శివారులో నిరాహార దీక్ష చేసినం. అప్పుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రభుత్వంతో మాట్లాడి, కిలోమీటరున్నర కాలువ నిర్మాణానికి 3.20 కోట్లు మంజూరు చేయించిన అని నమ్మించిండు. కానీ, ఇప్పటి వరకు పనులు చేపట్టలేదు. రైతులను మభ్యపెట్టి మోసం చేసిన్రు. ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్లే కాలువ పూర్తయితలేదు. ఇప్పటికైనా స్పందించాలి.
– కూర్మాని రాజశేఖర్ రెడ్డి, బస్వాపూర్ సర్పంచ్
కిలోమీటరున్నర కాలువ తవ్వుడు చేతనైత లేదు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా రైతుల గోసను పట్టించుకునేటోళ్లు లేరు. కాళేశ్వరం ప్రాజెక్టు 11వ ప్యాకేజీలో భాగంగా ఆర్డీ3 నుంచి ఎల్ఎం 6 కాలువ కేవలం కిలోమీటరున్నర నిర్మాణం చేపడితే పన్నెండు గ్రామాలకు సాగునీటి సమస్య పరిష్కారమైతది. మానకొండూర్ నియోజకవర్గంలో నాలుగు గ్రామాలు, సిరిసిల్ల నియోజకవర్గంలో 8 గ్రామాలున్నాయి. కానీ, కాంగ్రెస్‌కు కిలోమీటరున్నర కాలువ పూర్తి చేసుడు చేతనైత లేదు. ఎమ్మెల్యే గతేడాది నిధులు మంజూరయ్యాయని రైతులను మోసం చేసిండు. కనీసం ఇప్పడైనా నిధులు మంజూరు చేయించి కాలువ పూర్తి చేయించాలి.
– ఆత్మకూరి జ్యోతి, రామన్నపల్లి సర్పంచ్