రూ.430 పెరిగిన తులం ధర
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పుంజుకోవడంతో దేశీయంగా ధరలు పెరుగుతున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.430 పెరిగి రూ.52,940 పలికింది. గ్లోబల్ మార్కెట్లతోపాటు రూపాయి పతనం కూడా ధరలు పెరగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. అలాగే వెండి పరుగులు పెట్టింది. కిలో ధర రూ.1,330 అధికమై రూ.69,180 పలికింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.390 పెరిగి రూ.53,840కి చేరుకోగా, 22 క్యారెట్ల ధర రూ.350 ఎగబాకి రూ.49,350 పలికింది. కిలో వెండి ఏకంగా రూ.1,100 అధికమై రూ. 73,800కి చేరుకున్నది. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,978 డాలర్లకు, వెండి 25.62 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.