న్యూఢిల్లీ : దేశంలో పిల్లలను దత్తత తీసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ప్రతి ఏడాదీ 26 వేల మంది పిల్లల్ని దత్తత తీసుకోడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నా.. వారికి సరిపోయే స్థాయిలో 0 నుంచి 2 ఏండ్ల లోపు పిల్లలు ఏజెన్సీల వద్ద ఉండట్లేదు. అయినా కూడా 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి మధ్యలో అత్యధికంగా 5,022 మంది పిల్లలను దత్తత తీసుకున్నారు.
గత పదేండ్ల కాలంలో ఇదే అత్యధికం అని సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ తెలిపింది. 2024-25 మధ్య 4,515 మందిని దత్తత తీసుకున్నారని సీఏఆర్ఏ వెల్లడించింది. నిరుడు దత్తత తీసుకున్న వారిలో 392 మంది చిన్నారులు ప్రత్యేక అవసరాలున్న వారేనని.. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇలాంటి పిల్లల్ని దత్తత తీసుకుంటున్న వారి సంఖ్య 25 శాతం పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి.