హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): కాపులంటే అన్నదాతలని, పదిమందికి సాయం చేసేవారని, ఆర్థికంగా ఎదిగిన తర్వాత ప్రతిఒక్కరూ ఇతరులకు అండగా నిలవాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో క్యాటలిస్ట్ పేరిట నిర్వహించిన మూడురోజుల అతర్జాతీయ సదస్సులో ఆదివారం వద్దిరాజు పాల్గొని మాట్లాడారు. మున్నూరుకాపులు విద్య, ఉద్యోగరంగాల్లో రాణించినా వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలుగా ఎదగలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆప్టా సదస్సు సందర్భంగా ఆప్తులందరం ఒకచోట సమావేశమైనట్టుగా ఉన్నదని, క్యాటలిస్టును వచ్చేసారి క్యాపటలిస్ట్ పిలుచుకుందామని, ఆర్థికంగా మరింత ఎదుగుదామని పిలుపునిచ్చారు.
తన తండ్రి వద్దిరాజు నారాయణ 55 ఏండ్ల కిందట రైస్ మిల్లును ప్రారంభించారని, ఆయనిచ్చిన ధైర్యం, చూపిన మార్గంలో ముందుకు సాగి గ్రానైట్ వ్యాపారంలో గొప్పగా రాణిస్తున్నానని చెప్పారు. మున్నూరుకాపులు ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం సాధ్యమవుతుందన చెప్పారు. ఈ సదస్సుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలతోపాటు అమెరికా నుంచి సుమారు 5,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఎంపీ రవిచంద్ర కుమారుడు నిఖిల్ చంద్ర, కోడలు అనీల, కూతురు డాక్టర్ గంగుల గంగాభవాని, మున్నూరుకాపు ప్రముఖులు కొండా దేవయ్య, సీ విఠల్, రౌతు కనకయ్య, ఎం సుధీర్‌కుమార్, ఆకుల రజిత్‌కుమార్, డాక్టర్ పీఏల్ఏన్ పటేల్, ఊసా రఘు, ఆర్వీ మహేందర్, కొత్త లక్ష్మణ్, తెల్లా మురళీధర్, భేతి శ్రీధర్, మామిడి అశోక్, బాపట్ల మురళి తదితరులు పాల్గొన్నారు.