ఈ వ్యాసం శీర్షిక ‘చిన్ననాటి స్నేహితులు’ సినిమా కోసం సినారె రాసిన పాట పల్లవి! సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం సాక్షాత్కారమైన వెకిలి నవ్వుల, మోసపు మాటల, దుష్ట చతుష్టయ వ్యూహాల సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పటానికి సరిగ్గా సరిపోయింది కదా!
నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, రేవంత్‌రెడ్డి చతుష్టయం తెలంగాణ గడ్డ పైనుంచి నిస్సిగ్గుగా తెలంగాణ వ్యతిరేక కుట్రలకు తెరలేపిన్రు. ప్రధానికి వేరే పనేమీ లేనట్టు, ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి మరీ ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంల ఇంటికి పోయి సుదీర్ఘ మంతనాలు సాగించిన్రు. బాబు-పవన్‌తో సమాలోచనల అనంతరం జరిగిన బహిరంగ సభలో రేవంత్ తనతో కలిసి నడవాలని మోదీ అనడం, దానికి రేవంత్ ఇకిలించడం వారి ఎజెండాను చెప్పకనే చెప్తున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న చంద్రబాబు, తెలంగాణ పుట్టుకనే పార్లమెంట్ సాక్షిగా అవమానించిన మోదీ, రాష్ట్ర ఏర్పాటు కారణంగా వారం రోజులు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోని పవన్ కల్యాణ్, ఉద్యమకారులపైనే తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ ఈ నలుగురూ తెలంగాణకు శాశ్వత శత్రువులు. తెలంగాణ పేగుబంధం కల్వకుంట్ల చంద్రశేఖర రావు. కనుకనే దుష్ట చతుష్టయం ఉమ్మడి శత్రువు ఆయన! కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయటం అంటే తెలంగాణ అస్మిత ఆగం కావటం!
దుష్ట చతుష్టయం ఎజెండా ఒక్కటే కాబట్టి వారి అనైతిక బంధం బాహాటంగా సాగుతున్నది. ఒకరినొకరు కాపాడుకుంటూ, పరస్పర రాజకీయ, ఆర్థిక, అనైతిక ప్రయోజనాలు నెరవేర్చుకుంటూ ఒక్క తెలంగాణనే కాదు, సభ్యసమాజాన్నే పరిహాసం చేస్తున్నరు.
పరమ జుగుప్సాకరమైన అంశం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు పట్ల అత్యంత అమానవీయంగా, బాధ్యతారహితంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తున్న మోదీ, రేవంత్ వైఖరి! ఒక మైనర్ బాలిక అన్యాయానికి, మోసానికి, బెదిరింపులకు గురవుతూ ఉంటే, ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంటే మౌనం వహిస్తరా? రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా రాజ్యాంగబద్ధ బాధ్యతకు నీళ్లు వదులుతరా? అన్యాయాలకు వత్తాసు పలుకుతూ ‘నారీశక్తి సమ్మాన్’, ‘బేటీ బచావో’ నినాదాలతో ఊదరగొట్టే వాగాడంబరం దేశ ప్రధానికి శోభనిస్తదా? కేంద్ర హోంశాఖ సహాయమంత్రి పోక్సో నిందితుడిని కాపాడుతూ ఉంటే, పీఎం, సీఎం అతనిని పక్కన కూచోబెట్టుకుని నవ్వులు చిందిస్తరా?
కేంద్రమంత్రి ఒక దిక్కుమాలిన జర్నలిస్టు ‘పంచాయితీ’ పేరుతో బాలిక ఇంటికిపోయి దౌర్జన్యం చేయిస్తడా? ఈ దుర్మార్గాలను రాముడు, బీసీ కార్డు కాపాడాలని బహిరంగ సభలో సిగ్గువిడిచి చెప్తరా? ‘అబ్ కీ బార్ బీజేపీ సర్కార్’ వస్తే తెలంగాణ రేపుల నిలయంగా మారదా? తెల్లారితే నీతులు మాట్లాడే పవన్ కల్యాణ్ నోరు పడిపోయిందా? చంద్రబాబు తన శిష్యపరమాణువుకు ఉద్బోధ చేసి ఉండాలి కదా? కేంద్రంలో చక్రం తిప్పేవారు ఒక ఆడపిల్లకు న్యాయం చేయలేరా?
బండి భగీరథను పార్టీలకు అతీతంగా ఏకిపారేస్తున్నరు సోషల్ మీడియాలో. ‘నరేంద్ర మోదీ అభిమానినే కానీ ఈ విషయం జీర్ణం కావటం లేదు నాకు; ఇంత అన్యాయమా?’ అంటూ ఓ నెటిజన్ ఆగ్రహం వెలిబుచ్చిన్రు. వినయమో, భయమో, మరికొన్ని చీకటి ఒప్పందాల కారణంగానో రేవంత్‌రెడ్డి ఈ అకృత్యాన్ని అస్సలు పట్టించుకోవటం లేదు. బీఆర్ఎస్ మినహా రాష్ట్రంలోని పెద్ద పార్టీలు, పిల్ల పార్టీలు, యూట్యూబ్ గొట్టాలు అన్నీ మూగవోయినయి. కానీ, సమాజం మేల్కొన్నది! ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతుండటంతో, ఏమెరుగని సుద్దపూసలా ఆవులిస్తూ ఇప్పుడే నిద్రవీడిన రేవంత్‌రెడ్డి, ఎంక్వైరీలు, సిట్లు అంటూ పాచిపండ్ల పాట పాడుతున్నరు.
మరోవైపు..మనిషిగా మోదీకి గుండె తడి లేదు, అది ప్రస్ఫుటం! దేశ ప్రధానిగా కూడా యెంత ‘కోల్డ్ బ్లడెడ్‌గా, యెంత యాంత్రికంగా ఉంటరో నిన్న చూసినం. తెలంగాణకు పార్లమెంట్ బాధ్యత పడిన విభజన హామీలు ఇప్పటిదాకా ఎందుకు నెరవేర్చలేదో చెప్పరు; భవిష్యత్‌లో ఏంచేస్తరో చెప్పరు; సామాన్య గ్రామీణ ప్రజానీకానికి సైతం మహా బాగా తెలిసిన ‘పొదుపు సూత్రాలు’ మాత్రం వల్లె వేస్తరు! ఆయన తినే తిండి; కట్టే బట్ట; ఆయన మేకప్‌లు; ఆయన ఫొటోషూట్ల కోసం ఎంత వెచ్చిస్తున్నరో, ఆయన వ్యక్తిగత జీవితం ఎంత ఆడంబరమో తెలిసిన జనం ఈ ‘పొదుపు’ను హేళన చేయరా?
పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించండి అని మనకు చెప్పిన పెద్దమనిషి కొద్ది గంటల తర్వాత వందలాది కార్లతో రోడ్ షో చేస్తడు! ఇంతకంటే కల్ల, డొల్లమనిషి ఎవరైనా ఉంటరా? మోదీకి వీరాభిమాని అయిన ఒక కార్పొరేట్ మిత్రుడు కూడా‘మోదీ నుంచి ఇంత డ్రామా ఊహించలేదు. తెలంగాణ మనోభావాలు తెలియని మోదీ, అంతకంటే శుంఠలైన వారి రాష్ట్ర పార్టీపై భ్రమలు పటాపంచలు అయినయి’ అన్నరు ఫేస్బుక్ పోస్ట్‌లో.
తెలంగాణ ప్రజానీకానికి ఏమి కావాలో దుష్ట చతుష్టయానికి తెలియదు, ఇక్కడి చరిత్ర, సంస్కృతి పట్ల గౌరవం లేదు, జనం పట్ల ప్రేమ లేదు! అసలు పుట్టుకనే అవమానిస్తున్నవారికి, ఆనవాళ్లు చెరిపివేస్తున్న వారికి ఈ నేలపై చోటు ఉండకూడదు! కాళోజీ ‘ప్రాంతం అవతలికి తరిమేయమ’న్నరు కదా! అది గమనంలో ఉంచుకోవాలి తెలంగాణ జనం. తమ సొంత పార్టీ నాయకులపై నమ్మకం లేక, రేవంత్‌ను పెంచి పోషిస్తున్న మోదీ-బాబు ద్వయం ఆటలు తెలంగాణలో సాగనివ్వొద్దు. వారి వికటాట్టహాసాలు మనకు వార్నింగ్ బెల్స్ కావాలి.
జై తెలంగాణ!
– శ్రీశైల్ రెడ్డి పంజుగుల 9030997371