కరీంనగర్, మే 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఎర్రవెల్లిలో జరిగిన సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ ఆయా జిల్లాలకు ఇన్చార్జిలను ప్రకటించారు. దాదాపు ఆరు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియతోపాటు ఓటర్ లిస్టు సవరణ, తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుగుతున్న నేపథ్యంలో పార్టీ సభ్యత్వం కూడా డిజిటలైజేషన్ పద్ధతిలో జరపాలని నిర్ణయించారు. సభ్యత్వ నమోదు సజావుగా నిర్వహించడానికి ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ నుంచి సభ్యత్వ నమోదు సమన్వయ కర్తను నియమించాలని ఆదేశించారు. అందులో భాగంగా కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల బాధ్యతలను టీ జీవన్‌రెడ్డికి అప్పగించారు.