నాగర్కర్నూల్: కుటుంబ కలహాల కారణంగా ముగ్గురు పిల్లలను దారుణంగా చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో జరిగింది. ఏపీలోని ప్రకాశం ( Prakasam) జిల్లా యర్రగొండపాలేం మండలం పెద్దబోయపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు ( Gutta Venkateshwarlu) భార్యతో కుటుంబ కలహాల కారణంగా ముగ్గురు పిల్లలతో కలిసి బైక్ పై శ్రీశైలం పరిసర ప్రాంతాలకు చేరుకున్నాడు.
బుధవారం వెల్దండ మండలం పెద్దాపుర్ గ్రామ శివారులోని హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి బూర కుంట సమీపంలో వెంకటేశ్వర్లు మృతదేహం లభ్యం కాగా ముగ్గురు చిన్నారుల ఆచూకీ కనిపించలేదు. ఈనెల 31న ఉప్పునుంతల మండలం సూర్యతండా సమీపంలో చిన్న కుమార్తె వర్షిణి, కుమారుడు శివధర్మపై పెట్రోల్ పోసి నిప్పటించి చంపగా ఆ తరువాత కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలో పెద్ద కుమార్తె మోక్షితను కూడా పెట్రోల్ పోసి చంపి వేశాడు.
అనంతరం అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు మల్లికార్జునరావు ఫిర్యాదు మేరకు వెల్దండ ఎస్సై కురుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్, శ్రీశైలం జాతీయరహదారికి ఇరువైపులా ప్రత్యేక బృందాలు గాలించగా కాలిపోయిన స్థితిలో చిన్నారుల మృతదేహాలు లభించాయి.