Middle Children | న్యూఢిల్లీ, జనవరి 29 : సాధారణంగా సంతానంలో మధ్యములను అందరూ నిర్లక్ష్యం చేస్తుంటారు. తల్లిదండ్రులు కూడా ఇంటికి పెద్దవాడనో, చిన్నోడు అనో గారాబం చేస్తారే తప్ప వారిద్దరి మధ్యన పుట్టిన వారిని అంతగా పట్టించుకున్నట్టు అన్పించదు. అయితే మిగిలిన తోబుట్టువుల కంటే మధ్యన జన్మించిన వారే ఉత్తమ లక్షణాలను కలిగి ఉంటారని, ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఒక సర్వే తెలియజేసింది. మధ్యమ సంతానం అటు తమ కన్నా పెద్దవారు, తమకన్నా చిన్నవారి మధ్య నలిగిపోతుంటారు. పైగా వారు తరచూ నిర్లక్ష్యానికి గురవుతుంటారు. అయితే మిగిలిన తోబుట్టువుల కంటే వీరే అన్నింటిలో మెరుగ్గా ఉన్నట్టు ఆ సర్వే తెలియజేసింది. తీవ్రమైన ఒత్తిడి వల్లే వజ్రాలు తయారయిన విధంగా పెద్ద, చిన్న మధ్య తీవ్ర ఒత్తిడిని అనుభవించిన వీరు మెరుగైన పౌరులుగా మారుతారని పేర్కొంది. కెనడాకు చెందిన పరిశోధకులు ఈ సర్వే నిర్వహించారు.
వ్యక్తిత్వ రూపకల్పనలో జననక్రమం కీలకపాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు ఒక కుటుంబంలో తొలి సంతానంగా జన్మించిన వారిని బాధ్యతాయుత, చురుకైన వ్యక్తులుగా చూస్తారు. అయితే తమ్ముడును తరచుగా ప్రశాంతంగా, రిలాక్స్‌గా ఉండే వ్యక్తిగా భావిస్తారు. దీనివలన వారు చెడిపోయిన, ఆకతాయి అనే ముద్రను కూడా సంపాదిస్తారు. అయితే వీరిద్దరి మధ్యన ఉన్న పిల్లాడు తరచుగా ఇతరులకు కన్పించకుండా పోతాడు. ఇదేరకమైన వైఖరి మనం పలు సినిమాలలో కూడా చూస్తాం. కానీ మధ్యములుగా పుట్టిన వారి గురించి అందరూ మరచిపోలేదు. ఒక అధ్యయనం ప్రకారం వారు మిగిలినవారి కంటే అన్ని రంగాల్లో ముందుంటారని, నిజాయితీగా ఉంటూ గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతారని, ఇతరుల పట్ల దయతో, క్షమాగుణం కూడా ఎక్కువేనని సర్వే పేర్కొంది.