హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ): నరసింహస్వామి పుణ్యక్షేత్రం యాదాద్రి దేవస్థాన నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతున్నది. దేవాలయానికి ఈవో లేకపోవడంతో పాలనావ్యవహారాలన్నీ కుంటుపడుతున్నాయి. యాదాద్రి ఈవో వెంకట్రావు జనవరి 1న రాజీనామా చేసినప్పటి నుంచి ఆలయానికి కొత్త కార్యనిర్వహణాధికారిని ప్ర భుత్వం నియమించలేదు. తిరుమల తరహా లో తెలంగాణలో ప్రత్యేక దేవస్థానంగా పరిగణిస్తున్న యాదాద్రికి ఈవో నియామకంలో ఇంత జాప్యం జరగడం ఇదే తొలిసారి అని ఆలయవర్గాలు చెబుతున్నాయి.
ఈవో నియామకం విషయంలో సెక్రటేరియెట్లోనే పైరవీ లు జరుగుతున్నాయని, ప్రస్తుతం ఈవో ని యామకం ఫైల్ సీఎం వద్దనే ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటివరకు పనిచేసిన ఈవోల్లో చాలా వరకు ఇన్‌చార్జులుగానే ఉండటంతో దేవస్థాన నిర్వహణ విషయంలో వారు శ్రద్ధ పెట్టలేదనే చర్చ జరుగుతున్నది. కొందరు హైదరాబాద్ నుంచి యాదాద్రికి వారంలో మూడునాలుగురోజులు వచ్చి వెళ్తూ ఉండటంతో ఆ ప్రభావం దేవాలయ నిర్వహణపై పడుతున్నదని చెబుతున్నారు. కాగా, ఇద్దరు ప్రజాప్రతినిధుల కారణంగానే ఈవో నియామకం ఆలస్యమవుతున్నదని దేవాదాయశాఖతోపాటు యాదాద్రిలో చర్చ జరుగుతున్నది.
యాదగిరిగుట్టలో ఈవోల నియామకం వి షయంలో ప్రభుత్వ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎనిమిదినెలల కాలంలో ఐదుగురు ఈవోలు మారడం చర్చనీయాంశమైంది. ప్రొటోకాల్ ఉల్లంఘనల కారణంగానే ఈవోల మార్పు జరిగిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎనిమిదినెలల కాలంలో భాస్కర్‌రావు, వెంకట్రావు, రవికుమార్, హరీశ్, తిరిగి వెంకట్రావు.. ఇలా ఐదుగురు ఆఫీసర్లు మారారు. దీంతో దేవస్థానం సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతోపాటు అనేక కుం భకోణాలు వెలుగుచూసినట్టు తెలుస్తున్నది. 2014 నుంచి ఈవోగా పనిచేసిన గీతారెడ్డి 2024లో రాజీనామా చేశారు. ఆ తర్వాత దే వాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఎం రామకృష్ణారావును ఇన్చార్జి ఈవోగా నియమించారు.
ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆశీర్వచనం సమయంలో తలెత్తిన వివాదంతో రామకృష్ణారావును తొలగించారు. ఆ తర్వాత ఈవోగా వచ్చిన భాస్కర్‌రావు 2025 ఏప్రిల్ లో బదిలీ అయ్యారు. సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ వివాదం తలెత్తడంతో భాస్కర్‌రావును బదిలీ చేసినట్టు తెలిసింది. భాస్కర్‌రావు తర్వాత ఐఏఎస్ అధికారి వెంకట్రావు ఉద్యోగవిరమణ వరకు (ఆగస్ట్ నెలాఖరు) ఇన్చార్జి ఈవోగా కొనసాగారు. వెంకట్రావు ఉద్యోగకాలాన్ని పొడిగిస్తూ ఈవో గా బాధ్యతలు ఇచ్చినప్పటికీ నెలరోజులు సెలవుపై వెళ్లారు. దీంతో యాదాద్రి బాధ్యతలు పీసీబీ అధికారి రవికుమార్‌కు ఇచ్చారు. కొన్ని రోజులకు ఆయన కూడా సెలవుపై వెళ్లడంతో ఇన్చార్జి కమిషనర్ హరీశ్‌కు బాధ్యతలు ఇచ్చా రు. నవంబర్ 7న వెంకట్రావు తిరిగి ఈవోగా జాయిన్ అయ్యారు.
అధికారపార్టీ నేతల ఒత్తిడితోపాటు ముక్కో టి ఏకాదశి సందర్భంగా అంతర్గతంగా జరిగిన వివాదం నేపథ్యంలో జనవరి 1న (పదిరోజుల క్రితం) గుట్టలో ఉత్సవాలు జరుగుతుండగానే వెంకట్రావు రాజీనామా చేశారు. అనారోగ్యం కారణంగానే రాజీనామా చేస్తున్నట్టు వెంకట్రావు ప్రకటించినప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లే కారణమనే ప్రచారం జరుగుతున్నది. ఈవోగా పనిచేసిన వెంకట్రావు తమ విషయంలో ప్రొటోకాల్ పాటించడంలేదని, సీఎం దగ్గరకు ఒక్కరే వెళ్తున్నారని, తమను కాదని సొంతంగా పనులు చేసుకుంటున్నారని స్థానిక ప్రజాప్రతినిధులు ఆయనపై ఫిర్యాదులు చేసినట్టు ఆరోపణలున్నాయి.
దేవస్థానంలో తాము చెప్పిన వ్యక్తులకు ఉద్యోగాలు ఇవ్వాలని, తమ వారు ఎవరైనా వస్తే ప్రొటోకాల్ దర్శనం కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేస్తుండటంతో, ఆప్రజాప్రతినిధుల ఒత్తిడి భరించలేక ఆయన విధుల నుంచి వైదొలిగినట్టు చెప్పుకొంటున్నారు. సంవత్సరకాలంలో ఐదుగురు ఈవోలు మారడానికి స్థానిక నేతల ఒత్తిళ్లే కారణమనే ఆరోపణలున్నాయి. వైటీడీ పాలకవర్గం లేకపోవడం, తరచుగా ఈవోలు మారుతుండటంతో దేవస్థాన నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలున్నాయి.
గతంలో ఈవోగా పనిచేసి ప్రస్తుతం యాదాద్రి భువనగిరి అడిషనల్ కలెక్టర్‌గా ఉన్న భాస్కర్‌రావు పేరు కొత్త ఈవోగా తెరమీదికి వచ్చింది. ముగ్గురు ఐఏఎస్‌ల పేర్లు సీఎం రేవంత్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తున్నది. అందులో హన్మంతరావు, హరీశ్‌తోపాటు ప్రధానంగా భాస్కర్‌రావు పేరు పరిశీలిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. భాస్కర్‌రావు గతంలో ఈవోగా పనిచేయడంతోపాటు యాదాద్రి ప్రజాప్రతినిధులతో సన్నిహితంగా ఉండటం, దేవాదాయశాఖలో ప్రధాన అధికారి కూడా మద్దతు తెలుపుతుండటంతో భాస్కర్‌రావు పేరే ప్రతిపాదనకు వచ్చినట్టు తెలుస్తున్నది.