సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తర దిశగా సంచరించే విధానానికి ‘ఉత్తరాయణం’ అని పేరు. నిజానికి సూర్యుడి గమనం అనే పదం వైజ్ఞానికంగా సరైనది కాదు. సూర్యుడి చుట్టూ భూమి సంచరిస్తూ ఉండటమే నిజం. అయితే, భూమి మీద ఉండేవారికి సూర్యుడు దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపునకు మార్పు చెందుతున్నట్లుగా కనిపించే సందర్భమే ‘ఉత్తరాయణ’ పుణ్యకాలం.సూర్యుడు కర్కాటక రాశిలో సంచరించే కాలం ‘దక్షిణాయన సంక్రమణం’ అనీ, మకర రాశిలో సంచరించే కాలాన్ని ‘ఉత్తరాయణ సంక్రమణం’ అని అంటాం. దీనినే మకర సంక్రాంతి పండుగగా చేసుకుంటాం.
భోగి నాడు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసే సంప్రదాయం ఉన్నది. రేగు పండ్లను తల మీద పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని ఒక నమ్మకం. రేగుపండ్లు, చెరకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలను భోగి పండ్లుగా వాడతారు. ఎరుపు రంగులో ఉండే రేగు పండ్లను సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు. అలా ఆదిత్యుడి ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని భోగిపండ్లు పోస్తారు.
సంక్రాంతి నాడు సూర్యుడికి సంబంధించిన విశేషమైన నమస్కారాలు, పూజలు చేస్తారు. జరుగబోయే శుభానికి స్వాగతం పలుకుతూ బంధుమిత్రులతో కలిసి సంక్రాంతి పండుగను పెద్ద ఎత్తున చేసుకుంటారు. రాబోయే ఆరు నెలల కాలంలో శారీరక మానసిక ఉద్దీపనలతో, ఉత్తేజంతో అనేక శుభ కార్యక్రమాలను నిర్వహిస్తూ, ఆనందమయంగా గడపడానికి శ్రీకారమే ఈ సంక్రాంతి. పితృదేవతలను తృప్తి పరచడానికి తిల తర్పణాలు విడిచే సంప్రదాయమూ కనిపిస్తుంది.
మానవ జీవనమంతా ప్రకృతికి, పశుపక్ష్యాదులకు, సమాజానికి నిరంతరం ఉపకరిస్తూనే ఉండాలి. ఈ మూడిటితో కలిసి బతుకుతున్నప్పుడు వాటి క్షేమాన్ని నిరంతరం కోరడం మన ధర్మం. మనకు వ్యవసాయ జీవనంలో వినియోగపడే పశువులకు ధన్యవాదాలను చెప్పుకోవడం, వాటిని సంతృప్తి పరచడం కూడా మానవ జీవన ధర్మమే కదా! సంక్రాంతి తెల్లవారి కనుమ పండుగ సందర్భంగా పశువులకు చేసే పూజలు ఈ రకమైనవే.
కనుమ మరుసటి రోజు ముక్కనుమ చేసుకునే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంది.
సంక్రాంతి సందర్భంగా చేసే పిండివంటలు.. జీర్ణశక్తిని పెంచేవిగా ఉంటాయి. ఇక పండుగ సందర్భంగా కోలాహలంగా పతంగులు ఎగుర
వేస్తుంటారు. గాలిపటాల ఆటలో.. పిల్లలకు కావాల్సినంత సూర్యరశ్మి లభిస్తుంది. అయితే, ఈ ఆరోగ్యకరమైన సంప్రదాయం చైనా మాంజాల వినియోగంతో పక్షులకు ప్రమాదకరంగా పరిణమించింది. సంప్రదాయాల వెనుక ఉన్న పరమార్థం తెలుసుకుంటే.. ఈ తరహా వికృత పోకడలకు తావు ఉండదు.
సంక్రాంతికి ముందు రోజు ‘భోగి’ చేసుకుంటాం. ఇది ముఖ్యంగా వ్యవసాయం ఆధారంగా జీవనం సాగించే రైతుల పండుగ. ప్రతి లోగిలీ ధాన్యరాశులతో కళకళలాడుతూ కనిపిస్తుంది. గతంలో అనుభవించిన కష్టాలకు ముగింపు పలుకుతూ ‘భోగి’తో భోగ భాగ్యాలను తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఇంటికి చేరుకున్న ఈ తరుణంలో కష్టాలకు వీడ్కోలు పలుకుతారు. ఈ మేరకు ఇన్నాళ్లూ తమను పట్టి పీడించిన దారిద్య్రాన్ని తరిమికొడుతూ, కష్టాలన్నిటినీ అగ్నిలో ఆహుతి చేస్తూ భోగిమంటలను వేయడం ఆచారంగా మారింది.