ఓసారి సెలవుల్లో నాయనమ్మ వాళ్ల ఊరికి వెళ్లాం. ఏ ఊరికి వెళ్లినా.. కనీసం వారం రోజులు ఉండటం అలవాటు. పిల్లలందరం కలిసి ఆటలు, పాటలు, ఎగరడం, దుంకడం, చెట్లెక్కడం, కాయలు పంచుకొని తినడం, బొమ్మల పెళ్లిళ్లు చేయడం.. ఇలాంటివన్నీ రెండు మూడు రోజులు హడావుడిగా జరిగాయి.
ఒకరోజు నాయనమ్మ సరస్వతక్కను పిలిచి.. “బామండ్ల ఇంటికి బొయ్యి మనకు గీ గిన్నెడు చాయ్ పత్తా పెట్టాలె.. పెట్టుమని తీస్కరాపో!” అని ఓ గిన్నె ఇచ్చింది. సరస్వతక్క నన్ను కూడా పక్కింటికి తీసుకెళ్లింది. “బామండ్లు అంటే ఎవరు ఉంకోమ్మా! మరి మనం ఏం కులం?” అని నాయనమ్మను అడిగాను. నాయనమ్మ చెప్పిందేమిటంటే.. “వాండ్లు బ్రాహ్మలు. శివుడ్ని పూజిస్తరు. శివుని గుళ్లె పూజలు చేస్తరు. ఇగ రంగనాయకుల కోయిల్ల పూజలు చేసేటోళ్లు, మన ఇంట్లో వంటలు చేసేటోళ్లు వైష్ణవులు ఏరే! వాండ్లను అయ్యగార్లు అంటరు. మనంగూడ బ్రామ్మలమే గానీ, నియోగి బ్రామ్మలు అంటరు. మనదాంట్ల శానమంది కరణీకం జేస్తరు. కొందరు హుజూర్ దగ్గర మంత్రులుగ ఉండేటోళ్లు..” అంటుండగానే.. “మరి మననెందుకు దొరలంటరు?” అని నాలోని ప్రశ్నా రాక్షసి నిద్ర లేచింది. “దొరలు లేరు తొర్రలు లేరు. బాగ భూములు, జాగలు, సొమ్ములు ఉన్నోండ్లు దొరలు! నా బొంద.. మనకేమున్నది? అయినా, గివన్ని ఎందుకు? పోయి చెప్పిన పని చేసుక రాపోండి!” అని అక్కడితో ముగించింది నాయనమ్మ. లైట్ వేసిన వెంటనే కరెంట్ పోయినట్టు అయింది నా పని. ఈ నాయనమ్మకు ఎక్కువ నాలెడ్జి లేదు గానీ, ఇంటికెళ్లాక అమ్మనడిగి వివరాలు తెలుసుకోవాలి అనుకున్నాను.
ఇక ఆ బామండ్ల ఇంటావిడ పేరు రాంబాయమ్మ. కోల మొహంతో చాలా అందంగా ఉండేది. ఆమె కూతురు పేరు రాధమ్మ. బొద్దుగా ఉన్నా.. అందంగానే ఉంది. ఆమె భర్త చనిపోవడంతో పిల్లలతోసహా తల్లి దగ్గరే ఉంటుందని సరస్వతక్క చెప్పింది.మరోసారి ఎండాకాలం సెలవులకు పోయినప్పుడు మా చిన్నమ్మలు చెప్పుకొంటుంటే తెలిసింది. ఆ ఇంట్లో కూతురుకు.. అంటే రాధమ్మకు బాగా సుస్తీ చేసిందట. అయితే వాళ్ల బంధువు ఎవరో ఒకాయన వైద్యం చేసాడట. “నీకు ఒంట్లో చెడు రక్తం పెరిగింది. దాన్ని తీసేస్తే బాగవుతావు” అంటూ.. సిరెంజీతో రోజూ రక్తం తీసి గోడలకు చిమ్మేవాడట. “అయ్యో! రోగమొస్తె ఏవన్న మందులియ్యాలె, పత్తెం చెప్పాలె గానీ.. గా నెత్తురు తీసుడేంది?” అని అందరూ అనుకునేవారట. చివరికి పండులాగా ఉన్న రాధమ్మ బాగా చిక్కిపోయాక.. “అరె రాధక్కా! ఇలా సన్నబడ్డావు? చేతిలోకొచ్చేశావే!” అన్నాడట ఆ డాక్టరు. మా నానమ్మ మాత్రం వాళ్లింటికి పోయి.. “గా డాక్టరు మీకు చుట్టమైతే అయిండు గానీ, గిదేం వైద్యం? పిల్ల ఆగమైతున్నది గాదు! పట్నం తీసుకపోయి చూయించండి!” అని సలహా ఇచ్చిందట. చివరికి పట్నం తీసుకెళ్లి పెద్ద డాక్టరు దగ్గర చూపించారట. కానీ, అప్పటికే ఆలస్యం అయిందన్నారట. పాపం, కొన్నాళ్లకే ఆ తల్లి కళ్లముందే రాధమ్మ చనిపోయిందట.
చాలా ఏళ్లవరకూ అప్పటి పల్లెటూళ్లల్లో డాక్టర్లే ఉండేవారు కాదు. అప్పట్లో ఇన్నిన్ని జబ్బులుండేవి కావేమో! జలుబు, తలనొప్పి, అజీర్ణం, మలబద్ధకం వంటి ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఇంట్లోనే చిట్కా వైద్యం చేసేవారు. మాకు ఎప్పుడైనా తలనొప్పి వస్తే అమ్మ ఎర్రమట్టి నేలమీద నీళ్లు చల్లి.. తడిమట్టిని పేస్టులా చేసి తలకు పట్టీ వేసేది. దాన్ని నేలగంధం అనేవాళ్లు. పదినిమిషాల్లో తలనొప్పి తగ్గిపోయేది. మధ్యమధ్య జ్వరం విడువకుండా వస్తూ పోతూ ఉంటే.. పొద్దున్నే తెల్ల జిల్లేడు మొక్క పాలల్లో పసుపు కలిపి ఆదివారం, గురువారం వెన్నుపూసకు రాసేవారు. మూడు వారాలకే జ్వరం పూర్తిగా తగ్గిపోయేది.
మలబద్ధకం అంటే గుర్తొచ్చింది.. మా మేనత్త కొడుకు ఓసారి జ్వరం వచ్చి తగ్గిన మర్నాడు మలబద్ధకంతో బాధపడుతూ ఉన్నాడు. అప్పుడే రెండిళ్ల అవతల ఉండే ఓ నాటువైద్యుడు కరివేపాకు కోసం అత్తయ్య వాళ్లింటికి వచ్చాడు. వచ్చిన పని చూసుకుని వెళ్లే అలవాటు లేదాయనకి. అన్ని విషయాలూ ఆయనకే కావాలి. మొత్తానికి విషయం తెలుసుకుని.. “ఇప్పుడే ఒస్త” అని వెళ్లి చిటికెలో వచ్చాడు. “ఇగో.. గిది ‘జమాల్ గోటి’ అని మందు. మస్తు పనిజేస్తది. జాడిచ్చి కొడతది” అని వద్దంటున్నా వినకుండా శీనుతో తాగించి వెళ్లాడు. అంతే.. ఆ రోజంతా అతను చెంబు కిందపెట్టకుండా ఇటూ అటూ వెళ్లినవాడు వెళ్లినట్టే ఉన్నాడు. చివరికి చెమటలు పట్టి తెలివితప్పే స్థితిలో.. లెట్రిన్ నుంచి తీసుకురావాల్సి వచ్చింది. చివరికి ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఆయన బాగా కోప్పడి స్లైన్ ఎక్కించి సాయంత్రానికి ఇంటికి పంపాడు. సాయంత్రం వస్తానన్న జమాల్ గోటి నాటు వైద్యుడు మటుకు పదిరోజుల దాకా ఇంటికి రాలేదు.
పల్లెటూర్లలో ఆర్ఎంపీ డాక్టర్ల హవా నడుస్తూ ఉంటుంది. వేరే మార్గం లేకనో, ఖర్చు తక్కువనో జనం వాళ్ల దగ్గరికే వెళ్తుంటారు. మా ఊళ్లో కూడా ఒకళ్లిద్దరు అలాంటి డాక్టర్లున్నారు. అందులో ఒకాయన పేరే ‘సూది డాక్టరు’. జబ్బేదైనా, ఎలాంటిదైనా ఆయన ఇంజక్షనే ఇస్తాడు. పైగా ఆయన స్పెషాలిటీ ఏమిటంటే శరీరంలో ఎక్కడ నొప్పి అంటే అక్కడే ఇంజెక్షన్ ఇస్తాడట. చికెన్ గునియా అనే వ్యాధి ప్రబలిన సమయంలో ఆయన ఇంజెక్షన్ల పంట పండింది. ఇంటిముందు పెద్ద క్యూలు ఉండేవి. “ఒక్క సూదికే పెయ్యి నొప్పులన్నీ పోతయి. మస్తు మంచి డాక్టరున్నడు” అనేవారంతా.
ఆ తరువాత ఆయన ఓ కొత్తిల్లు కట్టాడు. ఊర్లో వాళ్లు ‘సూదుల ఇల్లు’ అంటారు దాన్ని.అయితే, ఆ తరువాత కొన్నాళ్లకే తన దగ్గరికి
వచ్చిన ఎవరో పేషెంట్‌కి ఇంజెక్షన్ చేయగానే..అయిదు నిమిషాలకే అతని ప్రాణం పోయింది.వాళ్ల తాలూకూ బంధువులు ఈ డాక్టర్ ఇంటిపైన
దాడిచేసి, ఆ తరువాత కేసు కూడా పెట్టారు. మొత్తానికి చాలా డబ్బులు ఖర్చుపెట్టి కేసు అవకుండా తప్పించుకున్నాడట. ఆ తరువాత ఆయన సూదుల ఖ్యాతి చుట్టుపక్కల పల్లెటూర్లకు పాకి,తన పరిధిని విస్తరించి ఇంకా ఇంజెక్షన్లు ఇవ్వడం ఎక్కువ చేసాడని తెలిసింది.
-నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి