జాయా భ్రాతృ సుతాదీనాం బన్ధూనాం చ శుభాశుభమ్
శ్రుత్వా దృష్ట్వా న కంపేత శోకహర్షౌ త్యజే ద్యుతిః॥
(నారద పరివ్రాజ కోపనిషత్తు 4-9)
‘భార్య, సోదరులు, పుత్రులు, బంధువులు మొదలైన వారి శుభాశుభాలను విని గాని, చూసి గాని యతి చలింపరాదు. శోకహర్షాలను విడనాడాలి..’ అని పై ఉపనిషత్ వాక్యానికి భావం. దుస్తులతో సంబంధం లేని యతి లక్షణమిది. మహారాష్ట్రలో గోరా కుంభార్ అనే కుమ్మరి పాండురంగడికి అపారమైన భక్తుడు. అతను నిరంతరం విఠలుడి నామస్మరణ చేస్తూ ఉండేవాడు. స్వామిని తలుస్తూ తన్మయత్వంలో లోకాన్నే విస్మరించేవాడు. ఒకనాడు కుండల కోసం మట్టిని సిద్ధం చేస్తుండగా.. అతని భార్య తమ పసివాణ్ని అక్కడే వదిలి నీళ్ల కోసమని బయటికి వెళ్తుంది. దోగాడే బిడ్డడు ఉన్నట్టుండి మట్టి గుంటలో పడిపోతాడు. గోరా మట్టి తొక్కుతూ పాండురంగ నామస్మరణం చేస్తూనే ఉంటాడు. ఆ పసివాడు గోరా కాళ్లకింద పడి ప్రాణాలు కోల్పోతాడు. కాసేపటికి వచ్చిన గోరా భార్య.. రక్తసిక్తమైన మట్టిని చూసి గోడుగోడునా ఏడుస్తుంది. అంత జరిగినా గమనించలేదు గోరా. అయినా అతనేం పట్టించుకోకుండా విఠలుణ్ని కీర్తిస్తూనే ఉన్నాడు. ఇంత జరిగినా.. ఆ పసివాడు దగ్గరికి వచ్చినట్టుగానీ, మట్టి గుంటలో పడినట్టుగానీ, తాను పొరపాటున తొక్కేసినట్టుగానీ అతనికి స్ఫురించనే లేదు.
భార్య పిల్లవాడిని తన దగ్గర వదిలిపెట్టినట్టు కూడా మరచే పోయినాడు. అతనికి తెలిసింది ఒకటే! విఠలుని మహిమా గానం. సన్యాసి ఐతే ఏమీ సంసారి ఐతే ఏమీ! అతనొక గొప్ప యతి. కాసేపటికి అతను తెప్పరిల్లాడు. బాధపడ్డాడు. చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తంగా తన రెండు చేతులూ విరుచుకున్నాడు. వ్యాపారం దెబ్బతిన్నది. విఠలుడు, రుక్మిణీదేవి మారు రూపాలతో వచ్చి అతని ఇంట్లో పనులు చేయడం మొదలుపెట్టారు. క్రమంగా గోరా వ్యాపారం పుంజుకుంది. ఒకనాడు మహాభక్తుడైన నామదేవ్ పరివారంతో పండరీపూర్ వెళుతూ గోరా ఇంటికి వచ్చాడు. సంకీర్తన చేస్తూ చేతులు పైకెత్తి చప్పట్లతో భక్తులను ఉత్సాహపరిచినాడు. గోరా కూడా పాడుతూ చేతులు పైకెత్తాడు. భక్తులు కేరింతలు కొడుతున్నారు. అతనికేమీ అర్థం కాలేదు. చేతులను చూసుకుంటే సలక్షణంగా మునుపటిలాగే వచ్చేశాయి. ‘నా బిడ్డను కూడా నాకు ప్రసాదించు తండ్రీ! నేను జీవించలేను’ అంటూ విఠలుడికి మొరపెట్టుకున్నది గోరా భార్య. ఆనాడు పోయిన బిడ్డడు చకచక పాకుతూ అక్కడికి వచ్చాడు. రంగడి లీలకు అందరూ పరవశించారు.